విన్నపములు భవానీశంకర విన్నపములు  

భవానీశంకర విన్నపములు
13

త్రిపురాంతకా! శతాయుర్వర్షపరిమితుండనై బాల్యకైశోరకౌమార వయోరూపంబులం గొంతకాలంబు గడపి యౌవనారంభసమయవిజృంభమాణ దుర్వారగర్వంబున నన్ను నేనెఱుంగక విహరింప మలయానిలసహాయుండై కీరమయూరభ్రమర మరాళపికానీకంబులు గొలువఁ బ్రసూనధనుర్ధరుండై మరుం డేప్రొద్దు నా వెంటఁబడి తిరుగ మూర్ధాభిషిక్తునకు మరలంబడని గడిమనీడ తెఱంగున నే నెవ్వరిఁ గైకొనక యథేచ్ఛావిహారుండనై సీమంతినీపయోధరదుర్గంబు లాశ్రయించి ముఖాంభోరుహగ్లానిం గావింపుచు బింబాధరీకబరికాభారభృంగవితతిం జక్కఁబఱపుచు భామినీజఘనశికతారాసుల విహరింపుచు మానినీయౌవనమహోద్యానవనంబునకుం గదిసి సురుచిరోరుకదళికాస్తంభంబు లుంపుచు లీలావతీమధురాధరరసాస్వాదనంబు గావింపుచు నీరీతి నెదు రెఱుంగక విహరింప జరాభారం బను పిశాచం బెదిరించి నాతోడం బోరొనర్పఁ గందర్పుండు దానును నిజబలంబులతో వెనుకవెనుకకుం దార నగరంబున యష్టి ధరియించి నా పయింబడి యట్టహాసంబున జెవుడు వఱపి దంతవైకల్యంబుగా మోది వగర్చుటం బెనంగి మొగంబు తెల్లంజేసి యేను వణంక భయం బాపాదించి లజ్జాభిమానంబు వోకార్చి తోడిజనంబు లేవగింప పెద్దయెలుంగున యొరు లెఱుంగం జేసిన వార్ధకంబు మదికి విరోధంబని తలంచి యింక నిన్నాశ్రయింప వలయునని భజియింపం దొడంగితి. పాపక్షయం బొనర్చి యిహపరసుఖప్రదాతవై సుగతి నొసంగి కాపాడి రక్షింపవే! భవానీమనోహరా!

భవానీశంకర విన్నపములు
14

AndhraBharati AMdhra bhArati - bhavanISaMkara vinnapamulu - bhavAnImanOhara vinnapamulu - bhavAnimanOhara vachanamulu - telugu andhra tenugu ( telugu andhra )