| విన్నపములు | భవానీశంకర విన్నపములు |
భవానీశంకర విన్నపములు
14
వృషాంకా! నామనంబున నెప్పుడు శరదిందుకుందమందారచంద్రికా ధాళధళ్యప్రభాభాసువర్ణుంగాఁ దలంపుచు దరహసితసుందరవదనారవిందుంగాఁ దలంపుచు నఖిలభువనాధీశ్వరుండవైన పరిపూర్ణబ్రహ్మంబు నీవ యని యూహింపుచు నీరీతిఁ దలంచుచుండం గోరి చరాచరసహితంబైన బుణ్యవనంబునం గల యాకారంబులు గానంబడు దృక్పథంబునకుం గనుఱెప్ప లడ్డంబై గాఢాంధకారంబు గల్పించు చందంబున నాలోనున్న యజ్ఞానంబు విజృంభించి యీషణత్రితయాది రక్షణోపాయప్రతికూలంబైన నిరవకాశంబు ముందర బొడచూపుచున్నయది. దురంతచింతాభరపరిశ్రాంతుడు మిమ్మె ట్లెఱుంగ నేర్చును? అపారదుష్కృతమహీరుహనిర్మూల భయంకరగుఠారంబగు మీభజన నా కెట్లలవడు? నిరయనీరసేంధనదావపావకంబైన మీస్మరణ నా కొసంగి యిహపరసుఖం బాపాదించి సుగతి నొసంగి రక్షించి కాపాడవే! భవానీమనోహరా!