| విన్నపములు | భవానీశంకర విన్నపములు |
భవానీశంకర విన్నపములు
15
సర్వేశ్వరా! బహువిధ వస్తుప్రపూర్ణంబైన కర్ణధారుండు లేని యోడ చందంబున నింద్రియపంచకంబుల నరిషడ్వర్గంబుల సప్తవ్యసనంబుల సుఖదుఃఖంబుల క్షుత్పిపాసల రజస్సత్వతమంబుల షడ్వికారంబులఁ బరిపూర్ణంబైన నాశరీరయానపాత్రం బవిచ్ఛిన్నంబైన సంసారాంభోరాశిమధ్యంబున దరిగాన్పింపక విహరింపఁ దొడంగె. నిరయరాహిత్యంబున దుష్కృతనిర్ధూతంబును నిహపరసుఖంబును గోరి యప్రతిద్వంద్వంబైన నీవంటి దేవతాసార్వభౌము నాశ్రయించియు మన్మనోరథసాఫల్యంబునకై నీచుల యాచింప దొడంగితి నని మహాధనుర్ధరుండు తెరవగుచు తక్రఘటభారంబు వహించిన వల్లవిం దో డాసించిన చందం బగుచున్నయది యిది నీకుజ్జగజ్జనాపవారంబైన యపకీర్తి గాకుండ భక్తసులభుండవైన జగచ్ఛ్లాఘ్యంబైన మీప్రజ్ఞావచనం బమోఘంబుగా నన్ను గటాక్షించి యిహపరసుఖంబుల నొసంగి కాపాడి రక్షింపవే! భవానీమనోహరా!