| విన్నపములు | భవానీశంకర విన్నపములు |
భవానీశంకర విన్నపములు
16
యమపుర వర్ణన
కృత్తివాసా! నీవు సకలభువనాధీశ్వరుండవై దుష్టనిగ్రహశిష్టపరిపాలనం బొనర్పుచుఁ బుణ్యపాపంబు లేర్పఱచి దుష్కర్ములం దండింపఁ బ్రచండభయంకర దండధరు నియమించితివి. అతం డున్న పురంబు ద్విలక్షయోజనవిస్తారంబును మృత్యుదేవతావిహారంబును కవ్యవాహనాది పితృదేవసమాకీర్ణంబును జిత్రగుప్తనివాసంబును దప్తలోహస్తంభానీకంబును వధ్యశిలానీకంబును గుంభీపాకమహాఘోరకరాళ తప్తవాలుకసంఘాతకాల సూత్రాభిధానంబునై యనలలోహితతైలశికతాన్విత రుధిరమహాంధకార క్రిమికీటకానేక సంకీర్తననిరంతరదందహ్యమానమానాంతర్విస్తార గంభీరఘోరమహాకార భయానకతప్తకూపంబుల దంశువ్రాతమశకమక్షికపిపీలికా భయంకరసంకీర్ణాగాధపరంపరానేక బహువిధనిబిడాంధకార పూతిమహాపూతికార్యపరిమితి నరకకూపంబులఁ జిరకాల రౌరవనరక దురంతరోదనధ్వానంబుల నవిచ్ఛిన్నవృశ్చికదందశూకశార్దూలసారమేయ శంచ్వా(?)యుతనిశాతవజ్రదంష్ట్రాభీల విస్ఫుటకీలికానీకంబుల నపారకిరకిరగర్జనతర్జిత భయాట్టహాసహుంకారఘీంకారంబైన ప్రేతలోకంబున కధీశ్వరుండై సర్వదిగ్భూమండలంబునకుం గింకరుల నంపి యాయుఃక్షీణమానవులకు మృత్యువు పొడచూపం దమచేతి వల్లెద్రాటిం బ్రాణంబులు దివియం బోవైవ యమభటవిస్ఫుటపాశవేదనాదు లెఱుంగక సర్వాంగచైతన్యంబున జన్మావస్థకంటె నధికంబైన మరణవేదనం బొరలుచు క్షీణకంఠనాథుండై ధనదారాపుత్రమిత్రాదుల మమకారంబు లుడిగి సృకిం(?) బొంది యాహారవంబునం బొరలుచు కింకరదర్శనభయభ్రాంతుఁడై యెట్టకేలకు నిర్గతజీవమారుతుండై కరచరణచక్షుర్నాసాశ్రవణ దగ్ధశేషంబైన నొక్కప్రాణంబు ప్రేతకళేబరంబునఁ బ్రవేశించి మరణస్థలంబునం బ్రేతభూమిని రుద్రవాయసరూపంబులం బరోక్షకరణమునందుఁ బ్రాణచతుష్టయంబు నిలిపి ద్వాదశవాసరంబుల కైదునుం గూడి యమభటులు కాలపాశంబునం దత్కళేబరంబు బంధించి బహువిధ పాశయంత్రంబుల సర్వాంగంబులం గట్టి తివియ వైవస్వతకరలోహగదాప్రహరణంబుల జర్ఝరితదేహుండై వాపోవుచు నశీతిసహస్రయోజనంబున ద్వాదశమార్తాండప్రచండకిరణతప్తసైకతంబును ననేకాశ్మదగ్ధసూచికానీకంబునునైన యమపథంబున నీడ్వంబడి మున్నిహలోకంబున దావానలతుల్యంబగు వైశాఖవేళాగమశైత్యోపచారంబుగా మహీసురులకు దధ్యోదనశీతోదక వ్యజనతాంబూల సుగంధప్రసూనఫల పాదరక్షప్రదానవిహీనుం డగుటం జేసి, యనేకబాధలం బొరయుచు దుఃఖభాజనుండై వృషభోత్సర్జన గోదానవిరహితుండైన కతంబున కేశాస్తిపూయ శోణితపూరంబును ననేకయోజనవిస్తారంబును నపారనిమ్నంబునునై నిరంతరంబు తోయధికరణిని బొంగుచు నేహ్యంబై నుడుకుచుండెడు వైతరణిం ద్రోచి ముంచి యెత్తుచు యమాలయనిర్గమద్వారంబునకుం గొనిపోవ నచ్చట వసియించియున్న ప్రళయకాలనిర్ఘాతపాకసమయ గర్జితసదృది(?)నిర్ఘోషభీషణ మృగపక్షికీటకంబులు గరచి విరచించు పెక్కుబాధలం బొరలుచు నచ్చటం బ్రేతశరీరంబు విడిచి రవికిరణోష్ణోదకంబుల కోర్వని యతిసుకుమారంబైన యాతనాశరీరంబు గైకొని దండధరప్రచండదృగ్జ్వలనజ్వాలలఁ గాలుచు నిహలోకంబునం జేసిన దుష్కర్మంబు లవియు విజృంభించి తన్నుం జుట్టుకొని బాధచేయ గడంగునప్పుడు భీకరక్రూరాకారులు సందంష్టదంష్ట్రాకరాళ వికటాట్టహాసరక్తలోచనులు మహోగ్రరోషావేషనిర్దయస్వాంతులు ప్రస్ఫుటవిస్ఫులింగోగ్ర దుర్నిరీక్షులు ప్రచండమారుతవేగులు ముండితశిరస్కులు నుత్తుంగస్థూలమేచక నీలవర్ణనీలాంబరులు నుద్దండదోర్దండప్రచండులు దీర్ఘపాశశస్త్రహస్తులు సర్వదిగ్వ్యాపులునైన భటులు కోపంబులు మొగంబులం జెమర్పం జుట్టుముట్టి యీచండాలుండు శంకరద్వేషుం డని కండ లురులం జేయుచు మేటికుట్టిమంబులందు వీడు శివపరాఙ్ముఖుం డని మొత్తుచుఁ బరమేశ్వరధ్యానవిహీనుం డని ఛురికంబులం గోయుచు విష్ణుదూషకుం డని మంటల కడ్డంబుగ బట్టుచు నారాయణస్మరణవిహీనుం డని చక్రంబుల నొత్తుచు బూజావిరహితుం డని కౌక్షేయకంబుల గడికండలు గావింపుచు దానధర్మవిహీనుం డని బెక్కుబాధల నొనర్చుచు నీరీతి పెక్కువేలేం డ్రధికావస్థలం బెట్ట మహాఘోరనరకంబుల బ్రుంగుచు నంత క్రిమికీటక శునకసూకర గార్దభకుక్కుటాది జన్మంబులు దాల్చి యాయురల్పుండై కడలేని జన్మంబు లెత్తుచు నడంగుచు కుష్ఠవ్యాధిమహారోగంబులం జచ్చుచుఁ బుట్టుచు నన్నిటికిం భారంబు లేక గొంతకాలంబునకు మనుష్యగర్భంబునఁ బుట్టి దారిద్ర్యమహాంధకారమగ్నుఁడై యెన్నటికి సుఖం బెఱుంగడు. కావున భవద్దివ్యాంఘ్రిసరోరుహచింతనారతుండై పుణ్యశ్లోకుడైన వాని భాగ్య మంభోజభవాదుల కయినను లెక్కింప శక్యంబే? నాకూర్చిన దుష్కృతకవచగ్రంథిని భవన్నామగదాప్రహరణంబునం బటాపంచలు గావించెద. నన్ను గృపాదృష్టిఁ గటాక్షించి సుగతి నొసంగి రక్షించి కాపాడవే! భవానీమనోహరా!