| విన్నపములు | భవానీశంకర విన్నపములు |
భవానీశంకర విన్నపములు
17
విశ్వంభరా! పురాకృతకర్మంబులపై నెపంబిడి న న్నాదరింప పరాకు చేసితివి. సర్వజీవదయాపరుండవైన పురాణపురుషుండవు, జన్మాంతరకర్మంబు లెవ్వియునైన సూచ్యగ్రంబంతైన నీవు చేయింపక నే జేయఁగలనే? కమలాసనాది దేవతాదుర్లభుండవైన జగదాకారుని ని న్నేవిధంబున వచియింపగలను? సంసారమహార్ణవమగ్నుండనై పారంబైన తీరంబుఁ జేరంగోరి నాభాగ్యవశంబున నానయంబు చందంబున సమస్తదేవతాసార్వభౌముండవైన మహాదేవుండ వగుటం చేసి ని న్నంతర్భావంబున సన్నిధానంబు గల్పించుకొని నాదైన్యంబు విన్నవించితి. దీనజనరక్షణదీక్షాపరుండవైన నీకు నన్ను రక్షించుట దుష్కరంబె? తృణప్రాయుండ నని నన్నుం దిరస్కరించక యీజన్మపర్యంతంబైన నాదుష్కర్మములం బారఁద్రోలి యిహపరసుఖంబు లొసంగి నన్నుం గటాక్షించి సుగతి యొసంగి కాపాడి రక్షింపవే! భవానీమనోహరా!