ఇతిహాసములు ఉత్తరరామాయణము పూర్వరామాయణ కథాసంగ్రహము
పూర్వరామాయణ కథాసంగ్రహము
కం.ఆ ప్రో లమరావతి యమ
రప్రభుఁ డేలు గతిఁ బంక్తిరథుఁ డేలు దినేం
ద్రప్రతిభా సుప్రతిభా
దీప్ర శుభాన్వితగుణ ప్రతిష్ఠానిధియై
24
సీ.తన యాజిభావంబు గనిపించె సకలస - న్నుత సత్కళా ప్రవీణత వహించి
తన గభీరత సూపెఁ దటినీమనోహర - ప్రఖ్యాతసఖ్య సంపదలఁ జెలఁగి
తన ప్రభావము దెల్పెఁ దపననందన గర్వ - నిర్గ్రంధన క్రియా నిరతిఁ దనరి
తన తేజ మెఱిఁగించె ననిమిషేశ్వర వజ్ర - దుస్సాధ దైత్య పంక్తుల వధించి
 
గీ.రాజమాత్రుండె యష్టదిగ్రాజవినుత
రాజితయశః ప్రతాపనిర్దళిత రాజ
హేళి రిపురాజభయదాజికేళి రాజ
రాజ ధనశాలి దశరథ రాజమౌళి
25
తే.గీ.ఆ నరేంద్రుండు బంధు సంతాన మలరి
పొగడ సంతానభూజంబు పగిదిఁ బెద్ద
కాలమిల యేలి సంతానకాంక్ష మించి
శిష్టసమ్మతి నొక యిష్టి సేయునపుడు
26
మ.అమరుల్‌ విష్ణునిఁ జేరి పంక్తివదనుం డత్రాసియై గాసి సే
య మరుల్లోకము సంచలించె నిఁక మమ్మాపన్నులం బ్రోవ నా
య మరుల్‌ నీ కెదురే జయింపఁగదవయ్యా యన్న లేనవ్వు డా
య మరుల్కొల్పుచు వారి వీడ్కొలిపి దైత్యచ్ఛేదనోద్యోగియై
27
సీ.శ్రీసూర్యకులసుధాసింధు వాకాంక్షించి - పాలమున్నీటిపై బాళి మాని
సహసముద్భూత వాత్సల్య ముంపఁ దలంచి - చిలువరాపాన్పు నెలమి మాని
యవనీసుతాంగసౌఖ్యము గాంచఁ గామించి - కలిమి తొయ్యలితోడి చెలిమి విడిచి
యలఘుమానుష లీల లవధరింప దలంచి - తన యమానుష చర్యయును దొఱంగి
 
గీ.వనచరత్వంబుఁ బూని ప్రోవఁగఁదలంచి
బ్రహ్మరుద్రాది దేవతా ప్రభుల మీఁది
హాళియును మాని నందకాద్యాయుధాభి
రాముఁ డయ్యెడ దశరథరాముఁడయ్యె
28
సీ.చలిగట్టుదొరపట్టి జపియించు మంత్రంబు - వేయి ఱేకుల తమ్మి వెలయు నంచ
పలుకుఁగొమ్మకు ఱేనిఁ గలిగించు తొలిపెద్ద - యీరేడు జగముల నేలు ఱేఁడు
ప్రాఁబల్కు జవరాండ్ర బలఁగంపు ముచ్చట - పెనునీటఁ దేలాడు పిన్న పాప
మరుగొంగ తలఁపు దామర మీఁది యెలదేఁటి - కలిమి యొయ్యారి నోముల ఫలంబు
 
గీ.కటిక చీఁకటి వెలుఁగు నెక్కటి వెలుంగు
మేటి రేద్రిమ్మరుల గెంటు పోటుబంటు
తొగలఁ దమ్ములఁ బ్రోచుకందోయిఁ జూచు
వేల్పు కౌసల్య కొమరుఁడై వృద్ధినొందె
29
కం.దారకుఁ డయి రఘువీరుఁ డు
దారకుతూహలముతోడఁ దండ్రి వనుప బృం
దారకు లెంచఁగ ముని బృం
దారకు క్రతురక్ష కరిగెఁ దమ్ముఁడు గొలువన్‌
30
వ.ఈ విధంబునం గౌశికతపోవనంబునకు సవనావనంబు సేయం జనిన తదనంతరంబ31
సీ.హోమధూమంబుతో వ్యోమంబు వ్యాపించె - భీమదైత్య స్తోమధూమరుచులు
సవనాగ్ని శిఖలతో దివిఁ బ్రాకె రేగాము - కఱకు జుంజుఱు వెండ్రుకల బెడంగు
లనలకుండ స్ఫులింగాళితోఁ జదలానె - నసురదంతోద్ఘట్టనాగ్ని కణము
లలఘుమంత్రారవంబులతోడ నిండె నా - కసము రాక్షస చమూకలకలములు
 
గీ.జటిల సంకల్పములతోడఁ జటుల దనుజ
కుటిల సంకల్పములు మీఱెఁ గుశికతనయుఁ
డసదృశప్రజ్ఞ రాఘవు నాజ్ఞచేత
యజ్ఞదీక్ష వహించిన యాక్షణమున
32
ఉ.దానవినీతినీతిగుణధాముఁడు రాముఁడు దొల్తఁ దాటకా
దానవి ప్రాణముల్‌ గొనిన దారుణశాతశిలీముఖంబునం
దా నవిరాజమున్‌ నముచిదానవసూదనుఁ డుర్విఁ గూల్చు చం
దాన విరాజమానభుజదర్పముతోఁ గెడపెన్‌ సుబాహునిన్‌
33
కం.పారమ్ములేని వడిగల
పాఱమ్మున రఘువరుండు వడనేసె నకూ
పాఱరమ్మునఁ గుటిలవ్యా
పారమ్మున మెలఁగు నలఘుబలు మారీచున్‌
34
వ.అప్పుడు35
ఉ.జన్నము నిర్వహించితని సన్మును లెంచఁగ నింత చిన్న రా
జన్నము గల్గఁ జేసె మనకందఱ కంచు సురల్‌ ప్రకీర్తనం
బన్న మునీంద్రుతో జనకుపాలికిఁ బోవుచుఁ ద్రోవ శాపపుం
బన్నముఁ బాపె గౌతమికి భానుకులుండు నిజాంఘ్రిసంగతిన్‌
36
సీ.నిటలాక్షు ధనువుఁ ద్రుంచుటకుఁ గౌశికుఁ డెట్టు - లనుమతించె నటంచు నమరు లనఁగఁ
జెలికాని ధర్మంబుఁ జెఱుపఁ గాకుత్‌స్థుఁడే - గతిఁ బూనె నని శైవగణము నుడువఁ
గడిఁది విల్‌ దునియు చప్పుడు వీనులకు విందు - సేయు నెప్పు డటంచు సీత దలఁప
నితఁ డల్లుఁడైన శ్రీపతిమామయగు రమా - జనకుఁ బోలనె యంచు జనకుఁ డెంచ
 
గీ.హరధనుర్భంగ కార్య మెవ్వరికిఁ దెలిపి
సూడు పుట్టింతు నని నిల్చుచో నిలువక
కలహభోజనమౌని నల్గడలఁ దిరుగ
శివుని విలు ద్రుంచె రఘువీరశేఖరుండు
37
మ.హరకోదండవిఖండన ప్రవణ బాహాదండపాండిత్య వి
స్భురణం జెందిన కీర్తి లక్ష్మివలె భూపుత్రీలలామంబు సే
కుఱ నక్కోమలి కొప్పుఁ దేఁటి తెగకున్‌ గుందంబు లర్పించు పో
ల్కి రఘుగ్రామణి క్రొత్తముత్తియపుఁ బ్రాల్నించెన్‌ వివాహంబునన్‌
38
ఉ.బాడబశూర! నిం జెనకు పార్థివు లెవ్వ రటంచుఁ గేరడం
బాడి బలా యిదేటి మదమంచు భృగూద్వహు గర్వవార్ధికిన్‌
బాడబ మౌ ప్రతాపము గనంబడఁ జేసి దివిన్‌ సురీజనం
బాడ బలంబుతో రఘుకులాగ్రణి సేరె నయోధ్య వేడుకన్‌
39
మ.తనుహేమం బధరాబ్జరాగమణియున్‌ ధమ్మిల్ల నీలంబు నా
ననపద్మంబు నఖాంశుమౌక్తిక వితానంబున్‌ గటీచక్రమున్‌
స్తనదుర్గంబులుఁగల్గి రాజ్యరమచందం బొందు భూపుత్రితో
జనకాజ్ఞన్‌ వనిఁ జేరె రాముఁ డెలమిన్‌ సౌమిత్రి సేవింపఁగన్‌
40
సీ.చిత్రకూటమణీవిచిత్రకూట సుఖేట - చిత్రకూటస్థలాసీనుఁ డగుచు
దండకాశరభవేదండకాసరముఖో - ద్దండకాననమృగధ్వంసి యగుచు
మానవారితపూజ్యమానవాస విరాధ - మానవాద హిమోగ్ర భానుఁడగుచు
దానవాగ్ని భిదానిదానవార్య భయప్ర - దానవాక్పరితుష్టమౌని యగుచు
 
గీ.దూషణాలాపఖర ఖర దూషణామ
రేషణద్వేషణానీక శోషణాతి
భీషణాశని ఘోషణాశ్లేషణాస్త్ర
పోషణుఁడు మించె రఘువంశ భూషణుండు
41
వ.తత్కాలంబునన్‌42
ఉ.శూర్పణఖోక్తిమారుతము సోఁక దశాస్యుఁడు కోపవహ్నియున్‌
దర్పకరోషవహ్నియు నెదం దగులం దగునీతి డెందముం
జేర్పక మాయలేడివలెఁ జేసి సుబాహునియన్న నంపినన్‌
దర్పమెలర్ప వాఁడు రఘునందను ముందర చేష్ట లొందఁగన్‌
43
పంచచామరమునరాదుఁ డీమృగంబు డంబునన్‌ వనంబులోనఁ గా
నరా దురాశ సీత దెల్పినన్‌ నరేంద్ర! వేఁటఁబూ
నరాదు మాయ యంచుఁ దో డనంగ నవ్వుకొంచుఁ గి
న్నరాదులెంచ రామభూమినాథుఁ డేఁగె వెంబడిన్‌
44
శా.సారంగంబు దయాంతరంగమున మున్‌ సంరక్ష గావించి యా
సారంగంబు హరించు టెట్లనక కాంక్షన్‌ సీత వర్షాబ్దమున్‌
సారంగంబువలెన్‌ నిజాగతిఁ దలంచం దన్మనః పద్మినీ
సారంగంబు విభుండు పట్టువడ కేఁచన్‌ లేడిఁ జంపెన్‌ దుదిన్‌
45
వ.ఇవ్విధంబునఁ గుహనాహరిణంబున్‌ మరణంబు నొందించి యత్తరణి కులాభరణంబు మరల నరుదెంచి పంచవటిం ప్రవేశించి46
చం.అవనిజఁ బర్ణశాల కడ నారసి కానక రాముఁ డింపు వా
య వనిఁ జరింపుచుం జని జటాయువు దెల్పఁగ భార్యకార్య మొ
ప్ప విని ఘనాకబంధునిఁ గబంధునిఁ ద్రుంచి కిరాతిపూజ ల
ప్పవినిభసాయకుండు గొని పంపకడన్‌ వసియించి యున్నెడన్‌
47
సీ.హిమధామకర కుందసుమధామ శరబృంద - సమధామమై జన్నిదము పొసంగ
వినుఁగెంపునగఁజాలు నునుఁగెంపు తెగ డాలు - మొనయింపు కుండలంబులు వెలుంగ
శుచిరత్నవరనీలరుచి నూత్న హరినీల - సుచిరత్న హారరోచులు సెలంగఁ
దులకించు తొలుకారు బలుమించుఁ బలుమాఱు - నలయించు మేనికాంతులు రహింపఁ
 
గీ.బసిఁడిముంజియు హొంబట్టుఁ బంచ హేమ
కంకణంబులు నరుణముఖంబు దీర్ఘ
వాలమును గల్గు నొక మహావానరుఁడు
వచ్చి పొడగన్న రఘువంశవర్యుఁ డలరి
48
ఉ.ఆయన భక్తి యుక్తిఁ దన కంబుజమిత్త్రుని పుత్త్రు మిత్త్రునిం
జేయ బహూకరింపుచు నజేయభుజాయత శక్తితో శతా
రాయుత శాతబాణహతి నైంద్రి సురేంద్రునిఁ జూడ నంపి తా
రాయుతమైన ప్రాజ్యకపిరాజ్య మొసంగెఁ బతంగసూతికిన్‌
49
కం.ఈలాగున రఘువీర నృ
పాలుఁడు సుగ్రీవునెడఁ గృపాళుం డగుచున్‌
మేలు ఘటియించి కపిపద
మేలుమనుచు వాన కొక్కయెడ వసియించెన్‌
50
వ.తత్కాలంబునన్‌51
సీ.కాదంబినులు మానసోదంబులనె యుండెఁ - గాదంబినులు నభోంగణము నిండెఁ
జాతకంబులు జాలిఁ జాలించె దవశిఖా - జాత కంబులు సముజ్జ్వలత డించెఁ
బుండరీకముల భూపుఁడు డాఁపు సెలవిచ్చెఁ - బుండరీకముల గుంపులును హెచ్చెఁ
జంచలాలోకాప్తి సంసారి వర్తించెఁ - జంచలాలోకాప్తిఁ జదలు మించె
 
గీ.స్తనితములు మీఱెఁ గరకలు ధాత్రిఁ జాఱె
నదులు వడిఁబాఱె మృగములు పొదలు దూఱెఁ
గర్షకుఁడు మెచ్చె వలిమిరి గాడ్పు హెచ్చె
వనధి బహుఘోషమున నార్చె వాన పేర్చె
52
ఉ.వానకరంబు దీటయు వానరనాథుఁ డనేక సేన తో
మానవనాథుఁగాంచి బహుమానవచోగతి కుబ్బి జానకీ
మానవతిం గనంగ నసమాన వనాటులఁ బంప వారలున్‌
మానిత మానితన్‌ జడిమ మాని తదాజ్ఞఁ జనంగ వారిలోన్‌
53
కం.పావని తారకమంత్ర జ
పావని రఘువీరుఁ డనుప నరిగెఁ ద్రిలోకీ
పావని వెదుకుటకుఁ దలం
పావనితాలోకనార్థమై త్వరపడఁగాన్‌
54
వ.ఈ చందంబునం బవననందనుండు జనకనందినీ సందర్శనంబుసేయం జని55
సీ.తన ధైర్యరమ కోర్వ దనినట్టు లొకగట్టు - వడిమెట్టి యొకగట్టు జడియఁ దాఁకెఁ
దన గభీరతఁ జాల దనులీల జలరాశి - మే జవనంబునఁ గ్రిందు మీఁదు చేసెఁ
దన యణుత్వము మహత్వముఁదెల్పు చందాన - సురసలోఁదనులీలఁ జొచ్చి వెడలెఁ
దన లోకబాంధవత్వము గోచరము సేయు - కరణి ఛాయాగ్రాహకత్వ మొందెఁ
 
గీ.దన తపఃఫలదేవతఁ గనిన సరణి
ధరణిసుత లంకలోఁ గాంచెఁ దన హరిత్వ
మెఱుక గావించు జోక ననేకదైత్య
వరమదేభంబులను ద్రుంచె వాయుసుతుఁడు
56
వ.మఱియును57
మ.పురదాహం బొనరించు శూలివలె నంభోజాప్తభూమంత్రి భీ
కరవాలానలకీలికావళుల లంకాదాహముం జేసి ముం
దర రామాస్త్ర పరంపరాగ్ని శిఖ లీ దారిం బ్రవేశించు నం
చరులెల్లన్‌ వినఁ బల్కి వచ్చి సతిమేలాత్మేశుతోఁ దెల్పినన్‌
58
మ.పరమానందమునన్‌ విభుం డనిలభూబాహాప్రతీపప్రతా
పరమావైఖరి కాత్మ మెచ్చి శుభ మాపాదింప నాపత్పరం
పరమాన్పన్‌ నినుబోఁటి బాంధవుని సంపాదింపఁ గల్గెన్‌ దయా
పర! మాకేమి కొఱంత యం చతని సంభావించి దీవింపుచున్‌
59
సీ.పటువనాటక వీరభట మహార్భటులచే - వనమార్గమార్గముల్‌ వనటఁ జెంద
నగచరవ్యాయామ నాదంబుచేఁ బ్రతి - ధ్వని మిషంబున ధరాధరము లడలఁ
బ్లవగవేగాటోప బాహుళ్యమున నదీ - గణము లుత్తుంగ భంగముల నొలయ
హరియూధపుల యట్టహాసంపు రవళిచేఁ - బూర్వాది దిగ్గజంబులు చలింప
 
గీ.బలసి బహువాహినీ ప్రభుల్‌ గొలువ రామ
విభుఁడు దక్షిణవాహినీవిభునిఁ జేరి
విరహవారాశి దరిఁ జేరువిధము దోఁపఁ
దత్తటంబున దిటముతో దండు విడిసె
60
వ.తదనంతరంబున61
తే.గీ.దశముఖుఁడు యుద్ధ చలిత త్రిదశముఖుండు
తన్ను నయమార్గ మెంచక తన్నుటయు వి
భీషణుఁడు ధర్మదూర విభీషణుండు
శరణు శరణనె ఖరవినాశరణుఁ జేరి
62
కం.పగతుని యనుజు సమీపో
పగతుని దయఁబ్రోచి విభుఁడు పౌలస్త్యు వధిం
పఁగ దేవ! త్రోవ యిటఁ జూ
పఁగదే యని మూఁడునా ళ్ళపాంపతి వేఁడెన్‌
63
వ.ఇవ్విధంబున64
మ.పలుమాఱుం దను వేఁడు రామవిభునిం పాటింప కుత్తుంగభం
గలసత్తోయ భుజంగ సంఘఫణ భంగ ప్రౌఢరంగత్తిమిం
గిలవాలప్రహత ప్రవాళశకలాకీర్ణరుణార్ణః ప్రభా
కలనం దేజము సూపె వార్ధి జడధుల్‌ గైకొందురే ధీరులన్‌
65
కం.తన వారిసత్త్వగతిచే
త నవారితనాదమగు నుదధిఁ జూచి విలో
కన లుఠదనలశిఖుండై
కనలుచు రఘువీరుఁ డుగ్రకార్ముక మూనెన్‌
66
వ.ఇవ్విధంబున నుద్దండ కోదండ మండిత కరుండై యచ్చండకరకులుండు ప్రచండరోషరసావేశంబున వారిరాశి గనుంగొని67
సీ.మొగు లానిన పరాగములు పరాగములుగా - శతకోటి శితకోటి శరము లేసె
గగనంబు నొరయు భంగములు భంగములుగాఁ - జటుల బాడబ శిఖాస్త్రములు వఱపె
సవరైన జలకరేణువులు రేణువులుగా - హరిదంష్ట్రికోగ్ర సాయకము లనిచెఁ
గమఠమీనాదికాంగవిభూతి భూతిగాఁ - గాలాగ్నితులితాంబకములు నించె
 
గీ.మహిత విద్రుమములు విద్రుమములు గాఁగ
లలిత మణిజాలములు జాలములును గాఁగఁ
గ్రకచముఖ నిష్ఠుర శిలీముఖములు గురిసె
వారినిధిమీఁద రఘువంశవర్యుఁ డడరి
68
కం.భువనములు దలఁకఁగాఁ దన
భువనము లింకించు రామభూపతి జితవా
సవి నయవిధిఁ గని జలనిధి
సవినయముగఁ గదిసి మ్రొక్కి సంస్తుతిఁ జేసెన్‌
69
సీ.శ్రీకర రఘుకుల క్షీరాంబునిధి సోమ! - సోమముఖ్యామరస్తోమధామ!
ధామనిధిప్రశస్తప్రతాపోదార! - దారకత్వ విదారితారివీర!
వీరభద్రోన్నిద్రవీరరసాధార! - ధారణాభ్యాసచేతఃప్రచార!
చారణశ్రీవిలాసనిరస్తరాజీవ! - జీవభావైక్యదృష్టిప్రదాన!
 
గీ.దానవప్రాణహృతిబాణతతిభుజంగ!
జంగమస్థావరరచనాంచత్ప్రభావ!
భావనాదూర బహుపావనావతార!
తారకబ్రహ్మనామ! కోదండరామ!
70
మ.శరముల్‌ దావకృశానుకీలల వినాశం బొందు చందాన నా
శరముల్‌ డిందె భవత్కరస్థల మిళచ్చాపప్రయుక్తంబు లౌ
శరముల్‌ డాసినయంత నీ కెదురె? యీ సప్తాంబురాశుల్‌ జితా
శర! ముల్లోకములుం జలించె నిఁక రోషం బూనకే నావుడున్‌
71
కం.జలధిన్‌ రఘుపతి కరుణం
జలధిం గానీక కాచి సరగఁ దదాజ్ఞన్‌
నలుచే రిపుసైన్య దవా
నలుచే సేతువు ప్రియంబునన్‌ గట్టించెన్‌
72
చం.కపులు హితాంచితక్రియలు గైకొని చేయుటయుం బయోధిపై
విపుల శిలాపరంపరలు వేసినఁ దేలుటయున్‌ నరుల్‌ నరా
దపుల జయింపఁ బూనుటయుఁ దా విపరీత మటంచు రావణుం
డపుడు దలంచెఁగాని కనఁడయ్యెన్‌ రాముప్రభావమెంతయున్‌
73
మ.పదవిధ్వస్తగిరుల్‌ గపీంద్రులు భజింపన్‌ దేవభూదేవతా
పదవిచ్ఛేదనవజ్రి రామధరణీపాలుండు సేతుస్థలీ
పదవిం బోయి సువేల మెక్కి యెదుటం బౌలస్త్యు ప్రోల్‌ గన్న సం
పద విన్నట్టుల చూచి సైనికులఁ బంపన్‌ వార లత్యుగ్రులై
74
స్రగ్ధరకారాకూరంబులై రాక్షసుల హృదయముల్‌ గాడ్పడన్‌ రాము నాజ్ఞం
గారాకుల్‌ డుల్చు వాత్యాగణము పగిది వేగంబు మీఱం బ్రదీప్రా
కారాఢ్యుల్‌ వీరవర్యుల్‌ కపులు గదిసి లంకాపురీగోపుర ప్రా
కారాదుల్‌ గూల్చి కారాగతసురవనితాక్లాంతి మాయించి రంతన్‌
75
మ.రవిపుత్త్రాంగద జాంబవత్పవనభూరంభప్రజంఘాంజనా
ధవనీలర్షభతాలధూమ్ర నలమైందశ్వేతముఖ్యుల్‌ ప్రహ
స్తవిరూపాక్ష నరాంతక ప్రముఖదైత్యగ్రామణుల్‌ మార్కొనన్‌
బవరంబయ్యె సురాసురాది సమర స్పర్ధాళుతాత్యుగ్రమై
76
సీ.అత్రాసహస్త ప్రహస్తాద్యదైత్య వి - ధ్వంసి నీలాదియూథపమహోగ్ర
మనల ధూమ్రాక్ష దేవాంతక ప్రముఖేభ - పంక్తి హరీభవత్పవన భవము
ఘటకర్ణపటునాసికాకర నిగ్రహా - గ్రహరవిగ్రహకుమారప్రచార
మతికాయమేఘనాదతమోవినిర్భేద - మిత్త్రాయమాణ సౌమిత్రి శరము
 
గీ.భూరిబలమూలబలవన ప్లోషరోష
భీమరఘురామ సాయక స్తోమ భూమ
దావపావకశలభీకృత త్రిలోక
కంటక దశాస్య మగుచు నక్కదన మమరె
77
చం.సమరనిదాఘవేళ శరశాతకరంబుల రామభాస్కరుం
డమర విరోధి రాజకుముదావలి నొంచి తపస్వి మానసా
బ్జము లలరించి వేల్పుఁ గవ జక్కవలన్‌ వెలిఁగించి లోకశు
క్తమము లడంచి తోరపుఁ బ్రతాపమునన్‌ వెలుగొందె నయ్యెడన్‌
78
మ.నటదాదిత్య వధూటికాతనువితానశ్రీలు సౌదామనీ
పటల చ్ఛాయలుగా నభస్తటరట త్పాకాభియాతి స్ఫుర
త్పటహధ్వానము గర్జగాఁ గురిసెఁ గల్పక్ష్మాజసూన చ్ఛటా
పటువర్షంబు దశాస్యకోప పరితప్త క్షోణిపైఁ జల్లఁగన్‌
79
సీ.అని దీర్ఘనిద్రఁ జెందిన వనేచరకోటి - బ్రతికించి యాశ్చర్యరసముఁ జూపె
శుచిముఖంబున నిత్యశుచియైన సీతతో - రహిఁగూడి శృంగార రసముఁ జూపెఁ
బగతుసోదరునికిఁ బ్రాజ్యరాజ్య మొసంగి - రక్షించి కారుణ్య రసముఁ జూపె
నర్కజాదులు గొల్వ హైమ పుష్పక మెక్కి - ప్రభుతఁ గైకొని శాంతరసముఁ జూపె
 
గీ.నల భరద్వాజముని విందు లారగించి
సంతస మెసంగ స్నేహాతిశయముఁ జూపె
భరతుసేమంబుఁ గన వాయుభవునిఁ బంపి
దశరథసుతుండు భ్రాతృ వత్సలతఁ జూపె
80
కం.ఆనందించుచు రఘుపతి
యా నందిగ్రామమునకు నటుల యరిగి సీ
తానుజపరిజనయుతుఁడై
తాను జతురలంకృతులు నుదారతఁ బూనెన్‌
81
వ.ఇవ్విధంబునం జతుర్విధాలంకార చారుశరీరుండై తదవసరంబున82
సీ.తన దివ్యమకుటంబు దన డంబున ననంత - మణిసంతతిద్యోత మహిమఁ గాంచఁ
దన కాంచన రథంబు తన విధంబున సమా - శ్రిత దేవతా నగశ్రీ రహించఁ
దన సితచ్ఛత్రకేతన రాజి దన లీల - ఘనమార్గ వర్తిష్ణుగతి వహించఁ
దన పార్శ్వ చామరద్వంద్వంబు దన యట్ల - సరిలేని శరకళాస్ఫురణ మించఁ
 
గీ.దన పురోవీథి మ్రోయు వాద్యములు దన మ
హోద్యమంబులవలెఁ ద్రిలోకోత్సవప్ర
దాన హేతువులై దిగంతముల నొలయ
రామచంద్రుం డయోధ్యాపురంబుఁ జేరె
83
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju