| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | విశ్రవోబ్రహ్మ జనన ప్రకారము |
| శా. | ఓ లీలావతి! నీ గుణంబులకు నా యుల్లంబు రంజిల్లె న న్నాలోకింపఁగనైన గర్భమున నీ కస్మాదృశుం డాత్మజుం డీలోఁ బుట్టెడు నేఁ బఠించు శ్రుతినీ వే వేళ నాలించి తా వేళన్ గర్భగుఁడౌట విశ్రవుఁడనన్ వీఁడొప్పు లోకంబునన్ | 151 |
| శా. | సుధ్యగ్రేసరుఁ డప్రతర్క్య నియమాస్తోక క్షమాయుక్తప స్స్వాధ్యాయ వ్రతశీలుఁ డాగమ రహస్యజ్ఞాన వైజ్ఞానికుం డధ్యాత్మార్థ విశారదుం డుభయవంశాధారుఁ డబ్జాక్ష రూ పధ్యానార్కవిభానిరస్తతముఁ డీ పౌలస్త్యుఁ డబ్జాననా! | 152 |
| కం. | మాతామహుఁడు బితామహుఁ డీ తనయుని నడక జూచి యింపొందుదు రం చా తపసి యానతీయ స తీతిలకము హర్షజలధిఁ దేలుచు నుండెన్ | 153 |
| వ. | తత్కాలంబున | 154 |
| మ. | శుభనక్షత్రమునన్ శుభేక్ష గ్రహముల్ సూడన్ శుభోచ్ఛస్థితిన్ శుభవేళం దృణబిందుపుత్రి గనియెన్ శుద్ధాత్ముఁ దేజస్వి నా త్మభవున్ విశ్రవు నాతఁడున్ సకల విద్యావైదుషిం దండ్రి నా త్మభవుం బోలి తపంబునన్ నిలిపె స్వాంతం బంత బాల్యంబునన్ | 155 |
| సీ. | పూరుషాకారంబుఁ బొందు త్రయీవిద్య - బాలత్వ మొందిన బ్రహ్మచర్య మాలోకగోచరయౌ ధర్మదేవత - ప్రాణంబు లూనిన భవ్య నియమ మవయవంబులు దాల్చినట్టి వైరాగ్యంబు - జంగమస్థితిఁ గన్న శాంతరసము వైయాత్య మొందిన వైదికాచారంబు - బ్రాహ్మణ్య మొనయు కృపాగుణంబు | |
| గీ. | దానె యన విశ్రవోబ్రహ్మ తల్లిదండ్రు లనుమతి యొసంగ నొక తపోవనముఁ జేరి యాశలు జయించి వెలయు భూమీశు లీల ఆశలు జయించి తపము సేయంగఁ దొడఁగె | 156 |
| కం. | రుచిర జటారుచికీలా ప్రచయము వోలం గుశాస్తరణపరివృతుఁడై శుచిభావమునఁ దపము సే యుచు నచ్చిఱుత జడదారి యున్నట్టియెడన్ | 157 |
| కం. | ఆ మునితనయుఁ గృతేంద్రియ యాముని యోగముఖ భావితాంచత్ప్రాణా యాముని జపఫలిత ప్రతి యామునిఁ గని రోమహర్షు లైరి మహర్షుల్ | 158 |
| మ. | శమసౌఖ్యామృతవార్థిమగ్ను నతనిన్ జామాతగాఁ జేయు చి త్తముతో నుత్తమ తాపసుండగు భరద్వాజుండు లేఁ బ్రాయమున్ గొమరుం గల్గినపుత్రిఁ దోడ్కొని రమాకోకస్తనిన్ దెచ్చి తొ ల్లి మధుద్వేషి కొసంగవచ్చు భృగు పోల్కిన్ వచ్చి పల్కెన్ రహిన్ | 159 |
| కం. | వర్ణినిధానమ! యీ వర వర్ణిని మత్పుత్రి దేవవర్ణిని యనఁగా వర్ణింపఁదగిన దిది యా కర్ణాంత విశాలనయనఁ గైకొమ్మనియెన్ | 160 |
| సీ. | అలమందగమనంబు హంసబోధ మొసంగఁ - గౌను నభోలక్ష్యగతిఁ బొసంగ మోవి కెంజిగురు జపావృత్తి వహింపఁ - బలుచాయ లష్టాంగ పటిమ నింప ఘననఖప్రభ తారకా యోగము గణించ - నాననం బమృతకరాభ మించఁ కొమరుఁ జెందు పిఱుందు గురుమహత్త్వముఁ దెల్పఁ - జిఱునవ్వు ముక్తానుసరణ దాల్పఁ | |
| గీ. | దన తపోరీతి కుచితయై తగిన దేవ వర్ణినీనామకన్య నవ్వర్ణి దల్లి దండ్రుల యనుజ్ఞ వరియించి తత్సమాగ మమున సకలగృహస్థ ధర్మములు నడపె | 161 |