| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | విశ్రవో బ్రహ్మకుఁ గుబేరుఁడు పుట్టుట |
| శా. | ఈ లీలన్ స్వగుణానుగుణ్యమతి యౌ నిల్లాలితోఁ గూడి యా పౌలస్త్యుండు గృహస్థధర్మ కలనాపారీణుఁడై పార్వతీ రోలంబాలకయందు శంభుఁడు కుమారున్ గన్న య ట్లా ధరా స్థూలాంచత్కటియందుఁ గాంచె నొక పుత్త్రున్ బుణ్యచారిత్రునిన్ | 162 |
| చం. | అవిరళపుణ్యలీల యగు నా శిశుసంభవవేళ భారతీ ధవుఁ డరుదెంచి పౌత్త్రజునిఁ దప్పక కాంచి ధనేశ్వరుండు వీఁ డవు నిఁక విశ్రవోమునికులాగ్రణి గన్న యపత్య మౌట వై శ్రవణుఁడనన్ జగంబునఁ బ్రశస్తి వహించు నటంచు నేఁగినన్ | 163 |
| చం. | ఉపనయనంబు సేసి శ్రుతియుక్తునిఁగా నొనరించి శాస్త్రముల్ కృపఁ జదివించి ధర్మ మెఱిఁగించి హితం బుపదేశ మిచ్చి పు ణ్యపురుషుఁడైన తండ్రి దను నన్నిట నేర్పరిఁ జేయ నాతఁడుం దపమున కేఁగె వంశగతధర్మము మానరు సాధు లెయ్యెడన్ | 164 |
| వ. | ఇవ్విధంబున వైశ్రవణుండు తపంబు సేయం జని | 165 |
| కం. | ఆహుతులఁ బ్రజ్జ్వరిల్లెడు స్వాహావిభులీల బ్రహ్మవర్చసము క్షమన్ బాహుళ్య మొంద నియమో త్సాహంబున నుగ్రతపమతం డొనరించెన్ | 166 |
| మ. | ఘననిష్ఠన్ జలపాయియై పటుతటిత్కాంతిచ్ఛటన్‌బెంజడల్ దనరన్ మించె సహస్రవర్షము లనంతక్షాంతి వాతాశనం బున వేయేండ్లు క్రమించె మే నచలమున్ బోలన్ నిరాహారుఁడై తను వాశింపక యేండ్లు వేయుఁ గడపెన్ ద్రైలోక్య మౌరాయనన్ | 167 |
| సీ. | పద్మాప్తగతి వహింపఁగలాఁడు గావున - మొనసి పద్మాప్తాభిముఖ్య మూని మకర సంగతి మీఁద మనుఁ గాన మకర భీ - కర జలాకర తరంగముల నాని ఘన విభావసు సమగ్రత ముందరికిఁ గాంచ - ఘన విభావసుమధ్యగత్వ మొంది యతను వర్ధనమైత్రి నలరఁ బోయెడుఁ గాన - నతనువర్ధనవృత్తి యవధరించి | |
| గీ. | ఘోరతపములు సేసి మిక్కుటపు మహిమ లవధరించిన మునులు ప్రయాస మనుచు వర్ణన లొనర్పఁ ద్రిసహస్ర వత్సరములు తపముగావించె విశ్రవస్తనుభవుండు | 168 |
| వ. | అంత | 169 |
| సీ. | ద్వాదశద్వాదశాత్మక కిరీటమణి ప్ర - కాండదీధితులు లే యెండఁగాయ భాషాబ్జపత్రదృక్పత్త్రాతపత్రముల్ - స్థిరశరచ్చంద్ర చంద్రికల నీన సురనదీతటిదురుస్ఫురణతోఁ దన తనూ - వర రుచుల్ బంగారు వానఁగురియ బ్రగుణాగమశ్రీలఁ దగు ఋషుల్ కిసలయో - జ్జ్వలజటాగ్రముల నంజలులు దాల్ప | |
| గీ. | గగురుపాటును వడఁకును గానిపింప నెల్ల సుమనోవితానంబు నెనసి కొల్వ మంచు జిగిపట్టి పొగడ విరించనుండు గరుణఁ బౌలస్త్యజునకు సాక్షాత్కరించె | 170 |
| కం. | పెన్నిధివలెఁ దన కిటువలె సన్నిధి సేసిన కడాని చాయల జేజే మన్నెదొర పెద్దఁ జూచి ప్ర పన్నమతిన్ లేచి మ్రొక్కి భయభక్తులతోన్ | 171 |
| పంచచామరము | హరామరాగ్రణి స్తుతావ్యయప్రభావభాస్వరా! స్వరాదినైకలోక సృష్ఠిశాసనక్రియాదరా! దరాబ్జహీరహార భాస్యుదారదార ధీపరా! పరాఖ్యమంత్రభృన్మనోబ్జ పద్మినీ మనోహరా! | 172 |
| కం. | అని తనుఁ బొగడిన మనుమని వినయమునకు మెచ్చి నలువ వేఁడుము వత్సా! నిను మెచ్చితి వర మిచ్చెద నని వచ్చితి ననఁ బులస్త్యజాత్మజుఁ డనియెన్ | 173 |
| తే.గీ. | లోకపతివైన నిన్ను నే లోకపాల కత్వమును హైమగర్భతఁ గన్న నిన్ను బహుధనాధీశ్వరత్వంబుఁ బ్రార్థనంబు సేయుచున్నాఁడఁ గట్టడ సేయుమయ్య! | 174 |
| ఉ. | కామితదాయివైన నినుఁ గన్గొనినంత ననంతలోక లో కామితచింతితార్థము లయారె లభింపవె? యంచు వేఁడినన్ దామరచూలి వల్కె ధననాథపదంబు దిగీశ్వరత్వమున్ నే ముదమంది నీకె కరుణించితి దేవత లెల్ల మేలనన్ | 175 |
| కం. | ప్రాగపర దక్షిణములకు నీ గిరిరిపు వరుణయముల సృజియించి యుద గ్భాగమున కొకనిఁ దలఁపం గాఁ గలిగితి నీవు మేము కౌతుక మొందన్ | 176 |
| ఉ. | పాలిత సత్య ధర్మ మగు బ్రహ్మకులంబునఁ బుట్టినట్టి నన్ నాలవవానిఁ జేయఁ దగు నా యనఁ బోకు దిగీశ్వరాళిలో నాలవవాఁడవై బహుధనస్థుఁడవై మనుమంచు మన్మనిన్ లాలనసేసి ధాత యొక నవ్యవిమాన మొసంగి వెండియున్ | 177 |
| ఆ.వె. | పుష్పకాఖ్య మిది యపూర్వయానము దివ్య పుష్పకాయమాన పూజ్యమాన మీ విమాన మెక్కి యెల్ల వేల్పులలోన నీవి మాన కలరు మింక ననుచు | 178 |