| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | మాల్యవదాది రాక్షసుల చరిత్రము |
| మ. | వియ దంభోమరు దున్నతిన్ వెలయు నవ్వీరత్రయిన్ సద్విరా జియశో నిర్మలమాల్యవంతుఁడన మించెన్ మాల్యవంతుండు ద్వి ట్చయ సంపత్కుసుమాలి నాఁ దదనుజాంచత్ఖ్యాతిఁ గాంచెన్ సుమా లియుఁ దేజోవిజితాంశుమాలి యయి పొల్చెన్ మాలి తద్భ్రాతృతన్ | 222 |
| శా. | ఆ రక్షస్త్రితయం బుపేక్షితమహావ్యాధిత్రయంబు న్బలెన్ దారుణ్యంబు వహించి తండ్రికరణిన్ దానెంతయున్ దేవతా కారుణ్యంబులఁ గామితంబులు గనంగా నెంచి యంచత్తపః ప్రారంభంబు వహించి కాంచనగిరి ప్రత్యంతశైలస్థమై | 223 |
| శా. | కీలాలంబని నీరుగ్రోలు రహి స్రుక్కించెన్, బలాశంబు లం చాలోకించుట మానెఁ బర్ణముల, మధ్వాఖ్యన్ ప్రవర్తింపఁగాఁ జాలించెన్ విరిదేనె, చాయ దొరయన్ జన్నన్ రవిద్రోహ దు శ్శీలం బౌనని రాక్షసత్రయి విసర్జించెన్ దరుచ్ఛాయయున్ | 224 |
| మ. | అతిలోకంబగు తాల్మితోఁ దపము లిట్లా రాక్షసుల్ సల్పఁగా యతిలోకం బరుదందె నంతటఁ దదీయ ప్రాంచి తాచార సూ నృత సంభావ్య మహాతపోజనిత వహ్ని జ్వాలికామాలికా హతి ముల్లోకములున్ దపింపఁ గని భాషాధీశుఁ డుద్భ్రాంతుఁడై | 225 |