ఇతిహాసములు ఉత్తరరామాయణము మాల్యవదాదులకు బ్రహ్మ బ్రత్యక్షమై వరంబు లొసఁగుట
మాల్యవదాదులకు బ్రహ్మ బ్రత్యక్షమై వరంబు లొసఁగుట
సీ.పలల భోజన తపోనలము వేఁడిమి నంచ - తేజి బంగరు ఱెక్క తేజరిల్ల
దోషాచరతపోగ్ని ధూమాళి భారతీ - ధవళాక్షి కొప్పుపూదండ లాన
దనుజత్రయీతపోదమున స్ఫులింగముల్‌ - మహనీయ ముకుటాగ్రమణుల నొరయ
దైత్యమూర్ధన్య మూర్ధజ తపశ్శిఖిశిఖా - చయముచే సావిత్రి మెయి సెమర్ప
 
గీ.నుగ్రనిష్ఠాగరిష్ఠులై యుగ్రమహిమ
నుగ్రతపమును గావించుచున్న రాక్ష
సాగ్రణుల చెంత కరుదెంచి యట్టె కాంచి
వెఱఁగు మించి విరించి దీవించి యనియె
226
ఉ.ఇంకఁ బ్రయాస మొంద వల దే మిము మెచ్చితిఁ గోర్కు లిచ్చెదన్‌
శంకఁ దొఱంగి లెం డసురశంకరులార! యటంచు భారతీ
పంకజలోచనాకచవిభాసుర కేసర వాసనాగతా
హంకరణాళిఝంకరణహారి మృదూక్తుల నానతిచ్చినన్‌
227
మ.అమృతాంభోధి తరంగ ఘుంఘుమరవోద్యత్తన్మృదూక్తిన్‌ గత
శ్రములై కన్నులు విచ్చి రాక్షసులు సాక్షాత్కారమై యున్న బ్ర
హ్మముఖాంభోజముఁ జూచి లేచి భయకంపావాప్తి సాష్టాంగదం
డము లర్పించి నుతించి రిట్లని లలాటన్యస్తహస్తాబ్జులై
228
మ.పురుషుం డంచుఁ బరేశ్వరుం డనుచు వేల్పుం బెద్ద యంచున్‌ మహే
శ్వరుఁడంచుం బరమాత్ముఁడంచు శ్రుతిశాస్త్ర జ్ఞాన పారీణు లే
ర్పఱుపం జాలక పెక్కు భేదముల నే భవ్యాత్ము నూహింతు రా
పరమేశున్‌ నినుఁ గొల్తు మేము శుభముల్‌ ప్రాపింప నశ్రాంతమున్‌
229
శా.ఆశాస్యంబులు నీవలెన్‌ నతుల కీయన్‌ జాలు జేజే గలాఁ
డే శశ్వత్కృప మాయెడన్‌ నిలిపి తండ్రీ! ప్రోచెదేనిన్‌ సమ
స్తాశాధీశ జయ ప్రతాపములు దీర్ఘాయుస్సదారోగ్య వి
ద్యాశాలి ప్రతిభల్‌ పరస్పర హితత్వంబున్‌ బ్రసాదింపవే!
230
కం.ప్రభవిష్ణులమై యెందును
నభివృద్ధి వహింతు మనుచుఁ బ్రార్థించినఁ బ
ద్మభవుం డాదరమున న
య్యభిమతము లొసంగి చనియె నాత్మీయులతోన్‌
231
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju