| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | మాల్యవదాదులు లోకంబుల బాధించుట |
| వ. | అంత | 232 |
| శా. | భాషానాథవరప్రదాన విలసద్బాహా బలాటోపులై దోషాటాధిపతుల్ మదాంధత సుధాంధోముఖ్యులన్ గెల్చి త ద్యోషారత్నములన్ గ్రహించి మునులన్ దూలించి సాధ్యాదులన్ రోషాగ్నిన్ దపియింపఁ జేసి సురవైరుల్ మెచ్చ వర్తించినన్ | 233 |
| సీ. | పట్టుగానక బయల్ వట్టి రాదిత్యులు - ఖచరుల ద్రోవలు గట్టువడియె దీనులై గరుడులు దెసచెడి పాఱిరి - తుషితులు బడలికతోఁ దిరిగిరి వసువులు పేదలవలె గాసి చెందిరి - గమిఁ బాసి రుద్రులు గాడుపడిరి యడ్డగింపులకు లోనైరి మరుత్తులు - చేరిరి గిరిగుహల్ సిద్ధవర్యు | |
| గీ. | లోడి గంధర్వు లూడనిఁబాడి రచ్చ రలకుఁ జెఱ లుప్పతిలె మహారాజికులకుఁ గలిగెఁ దలగంప దింపని వలసపాటు రాక్షసులు సేయు రాయిడి రఘువరేణ్య! | 234 |
| కం. | నిరయగతులైన ప్రాణుల కరణిన్ రక్షకుని నొకనిఁ గనక సుకేశా సురసుతబాధిత భువనాం తరగతు లాపదలఁ బడిరి తత్కాలమునన్ | 235 |
| శా. | ఆ రాత్రించరశేఖరుల్ ముగురు ని ట్లాదిత్యహృద్భీకర స్వైరస్ఫారవిహారులై తమకు భూస్వర్గంబు లీలన్ మనో హారంబౌ నగరం బొనర్చుటకుఁ గా నర్ధించి శిల్పప్రభా ధౌరేయుండగు విశ్వకర్మఁ దలఁపన్ దద్ధన్యుఁ డేతెంచినన్ | 236 |
| ఉ. | మాల్యవదాదు లిట్లని రమర్త్యుల కల్మియు బల్మి కీర్తి బా హుళ్య మెఱంగి వారికి యథోచితగేహము లీవొనర్పఁ బ్రా బల్యముఁ జెందె నీ చతురభావము దిక్కుల నోయి శిల్ప కౌ శల్యనిధాన! మాకు నిఁక సద్గృహముల్ రచియింపఁగాఁ దగున్ | 237 |
| మ. | హిమవత్పర్వతమౌళిమీఁదనయినన్ హేమాద్రిపై నైన మం ధమహీధ్రాగ్రణిమీఁదఁ నైనఁ గలధౌతక్షోణిభృచ్ఛృంగతుం గమణీగోపురసౌధయూధములు గల్గన్ మాకు నిర్మింపు గే హము లంచున్ వచియింప నయ్యమరశిల్పాచార్యవర్యుం డనున్ | 238 |
| ఉ. | దక్షిణ వారిరాశి తటధారుణి భాసురమౌఁ ద్రికూటనా మక్షితిభృద్వరేణ్య మసమానమణీమయసానుసంపదన్ దక్షిణదిక్త్రికూట మనఁ దద్గిరి శృంగమునం దొనర్చితిన్ రాక్షసులార! మున్నొకపురం బసురేంద్రుని యాజ్ఞ పెంపునన్ | 239 |
| వ. | అదియును షష్టి యోజన విస్తీర్ణంబును, శతయోజనాయతంబును, వినిర్మల ముక్తాఫల నిర్మిత నర్మ హర్మ్యచ్ఛవిచ్ఛటాధవళితహరిదశ్వ హరిత్తురంగంబును, నుత్తుంగ గోపురోపరి ద్వారాంతర స్థాపిత కాంచన పాంచాలికాబాలికాస్తనాంతరక్షౌమపటోత్తరీయాయిత వియత్తటినీ తరంగంబును, వాసవకృతత్రాసనిరాసార్థవనరాశి సమానీత కలధౌత గిరిపోతతులితలలితమణిమయక్రీడాచలవిరాజమానంబును, నిజవైభవాధఃకృతసమగ్ర సౌభాగ్యలక్ష్మీప్రార్థనానిమిత్తసమాగతభోగవతీ పురవ్యంజకపరిఖాయితాంభోధి గతాత్మ ప్రతిబింబంబును, శతకోటి శివాలయ నీలప్రాకారజాలప్రభాభిధముధాభ్రమర సముదయారుణ కమలాయిత కమలహితమండలంబును నాయికోచిత మరకత మణిమయ ఘననివసనకనకవసనగగనలక్ష్మీ ప్రకల్పిత పుష్పోపహారాయితతారా ప్రతానంబును, వనపవనచలితలతాప్రతానపతత్ప్రసూనపరిమళమిళిత పరాగవాసి తాజాండకరండంబును, సమస్తవస్తువిశేషంబులకు జన్మనివాసంబును, నఖిలవిభవలక్ష్మీ విలాసంబలకు వీడుపట్టునునై కనుపట్టునట్టుగా గంగాదిశకునదుష్ప్రవేశంబును, డంకాగ్రవిచ్ఛిన్న చతుర్దిశావకాశంబును నగు త్రికూటశిఖరి శిఖరప్రదేశంబున స్వర్గలోక వస్వౌకసాది దిక్పాలపురంబులు నిర్మించి యాఱితేఱిన శిల్పనైపుణ్యంబు మెఱసి నిర్మించిన యా లంకాపురంబు మీ కాఁపురంబునకుఁ దగు నందు నిలువుండని వెండియు విశ్వకర్మ వారలం గనుంగొని | 240 |
| శా. | లంకాదుర్గముఁ జేరి శాత్రవులకున్ లక్షింపఁగా రాక ని శ్శంకఖ్యాతిఁ గనంగలారని గదించన్ శిల్పి సమ్రాట్సుధా సంకాశోక్తుల నుత్సహించి బహురక్షశ్రేణితో దోర్బలా హంకారంబునఁ జేరి రప్పురి నిశాటాధ్యక్షు లొక్కుమ్మడిన్ | 241 |
| శా. | ఆలేఖద్విషదగ్రగణ్యుల భుజాహంకార తేజోవయ శ్శ్రీలెల్లం దిలకించి నర్మద యనం జెల్వొందు గంధర్వి సు శ్రీలావణ్యగుణాభిజాత్యముల హ్రీశ్రీకీర్తులన్ బోల్ప నౌ స్త్రీలన్ మువ్వుర నిచ్చె నాత్మసుతలన్ జ్యేష్ఠానుపూర్వమ్ముగన్ | 242 |
| తే.గీ. | నర్మద వళిప్రహసిత మహోర్మి కలిత నర్మద సుపర్వ సతియయ్యు దుర్మదులకు నసురులకు నెట్లొసంగెఁ కన్యకల ననకు కలిమి గుణ మట్టి దిక్ష్వాకుకులవరేణ్య! | 243 |
| చం. | మరుఁడు త్రిలోకమోహకరసూత్ర నిగుంభితమార్గణత్రయిన్ దరుణులు గా నొనర్చి భువనత్రయ భీకర రాక్షసత్రయిన్ మరులున ముంప నంపెనొ యనన్ దగు నజ్జవరాండ్ర మువ్వురన్ బరిణయమై అమర్త్యుల క్రమంబున వారు సుఖించి రంతయున్ | 244 |
| వ. | అంత | 245 |
| కం. | సుందరి యను నిజసుందరి యందుఁ గనియె మాల్యవంతుఁ డాత్మజ నొకతెన్ నందనుల నేడుగుర విను మందఱ నామములు దశరథాత్మజతిలకా! | 246 |