| కావ్యములు | ఆంధ్ర పురాణము | అవతారిక |
| అవతారిక | ||
| శా. | శ్రీకారంబును జుట్టినాఁడఁ గృతి కాశీర్వాదముల్ సేయు మ మ్మా, కామేశ్వరి! విశ్వలోక జననీ! మాతల్లిపుట్టింటి వే ల్‌పై కాపాడుచు నున్న యన్నెనరు నాయం దింత సారింపు మ మ్మా, కైమోడ్తు భవత్కటాక్ష రసభిక్షాభ్యర్థినై భక్తిమై. | 1 |
| శా. | మన్మల్ పిన్నటి మన్మరాండ్రు నిరుచెంపం గాయలుం బూవు లౌ చు న్మేలూరిన దోసతోఁట గతి మెచ్చుల్ గూర్చు సంసార యా త్ర న్మాధుర్యధురీణముల్ ఫలము లందం జుబ్బఁజూఱాడు జీ వన్మాతా పితలార! మీచరణసేవాజీవి దీవింపుఁడా! | 2 |
| మ. | తన బోధించిన కావ్యనాటక కళాతత్త్వంబునన్ మొగ్గ వి చ్చిన యీ నాయెడ శాబ్ద సౌరభము వోసెన్ వాసి నార్జింప దీ వనలం జేసె మహానుభావుఁ; డల సుబ్బారాయశాస్త్రిన్ మద ర్చన పీఠంబు ‘మహేంద్రవాడ’ గురువంశస్వామి భావించెదన్. | 3 |
| మ. | తొలిమేల్ త్రోవలు నేఁటి సంస్కృతుల రీతుల్ లెస్స గుర్తించి, నా తలలోఁ దీయని నాల్కగా మెలఁగు సోదర్యుండు ‘సూరయ్య శా స్త్రులు’ నా తీర్చెడి సర్వ బంధములయందుం గొంత చేదోడుగాఁ జెలఁగున్; వాని కనామయాయువు మదాశీరక్షత ల్వోయుతన్! | 4 |
| వ. | అని తలంచుకొని యొకనాఁటి బ్రాహ్మముహూర్తమునం దొలినాఁటి తెలుఁగువారి చరిత్రసారంబు నవపర్వ పరిమితంబుగా వింగడించుకొని ‘యాంధ్రపురాణ’ కావ్యరచనకుం గడంగినాఁడ; సర్గ ప్రతిసర్గాది పంచలక్షణలక్షితముకాక, త్రిలింగరాజ వంశ్యానుచరిత ప్రధానమై యుదయ, సాతవాహన, చాళుక్య, కాకతీయ, పునఃప్రతిష్ఠా, విద్యానగర, శ్రీకృష్ణదేవరాయ, విజయ, నాయకరాజ సమాహ్వయంబులగు నవపర్వంబులతో సంభృతమైన యేతత్కృతికి నవతారిక యెట్టిదనిన - | 5 |
| మ. | నవమాసంబులు మోసి కాంచి ‘కవిసంతానంబుతో నందనం బవు నాజీవిత’ మంచు నెంచుకొని తీయంబారఁగాఁ బెంచి బు జ్జవము న్నించెడి మాతృదేవత కటాక్షశ్రీలతోఁ దత్తనూ భవతం బెత్తనమంది గొంతు సవరింపం జూతు నీనాఁ డిటుల్. | 6 |
| ఉ. | పెంచి బెడంగు పాటఁ దలఁపించుచు మావిచివుళ్లు నోటఁ ది న్పించిన కన్నతల్లి దెస నే నధమర్ణుఁడఁ; గాని, లోన నొ క్కించుక తన్పు - [1]ఆంధ్ర రచయితలు మున్పు రచియించిన కూర్పునఁ ‘దల్లితండ్రి’ నర్చించిన దొడ్డవైభవము చేకుఱుటన్ ఘటియిల్లు నియ్యెడన్. | 7 |
| మ. | ఇఁక నాకున్ సకల క్షణంబులును సాహిత్యమ్ముతోపాటు ధా ర్మిక సౌహిత్యముఁ బంచియిచ్చుచుఁ గళారేఖారుచుల్ దీర్చు తం డ్రికిఁ గావ్యార్చన సేయకున్నఁ బితురంతేవాసినై కన్న వా సికి భాసించునె! మాధురీ పరిమళశ్రీ రోచిరభ్యున్నతుల్. | 8 |
| గీ. | మరల నాతోడఁ బసియీడు తిరుగఁదోఁడి యాడె - జతగూడె - నక్షరాభ్యసన మెనసె శబ్దమంజరి వట్టె - శాస్త్రమ్ము ముట్టెఁ గవిగ దీవించెఁ - దన గొంతుకలిపి పంచె. | 9 |
| ఉ. | ఆయనపంపు పెంపు లొరయం బయనించుచు నుండి, యొండెదో తీయని లోఁదలంపు గుఱుతించితి, నాంధ్రుల పూర్వగాథ లా మ్నాయము చేసికొంటిఁ బరమప్రియ ఘట్టములం బురాణముం జేయఁగఁ బూనుకొంటిఁ గృతిచేఁ బితృపాదుల నామతింపఁగన్. | 10 |
| మ. | ఒకనాఁ డాదరమార నారచన మత్యుత్సాహియై యాలకిం చి, కళాలాలసతం గరంగి, మధురాశీరార్ద్ర దృష్టుల్ సభ క్తికమౌ నా పసిదోయిట న్నినిచి రక్తిన్ లోన నన్ గాంచు తం డ్రికడం గోరిక వెల్లడింప నిటు లంటిన్ గొంత డగ్గుత్తికన్. | 11 |
| శా. | ‘ఈ నోటం బలికించు మాట లివి నీవే; పాటలు న్నీవె; తం డ్రీ! నా గీసిన యక్షరాక్షరము నీవే; నాకుఁ బ్రత్యక్ష వి జ్ఞాన జ్యోతివి నీవ తత్త్వమున; నైనన్ , లౌకికారాధనా ధీన ప్రాకృత భక్తి నిన్నొకటి యర్థింతుం గుమారుండనై. | 12 |
| క. | నా కూర్చిన యీ కబ్బము నీ కుడుగరగా నొసంగ నేర్చినపుడు కా దా, కృతినై సాగుదు! నం గీకార మ్మిడవె దీనికిన్ బుణ్యమతీ! | 13 |
| మ. | అని వేఁడం జిఱునవ్వు నవ్వుకొని శ్రేయఃకాంక్ష తీపార, మ జ్జనకుం డీగతిఁ బల్కె నా యెడల వాత్సల్యంబునం జేసి ‘నా యన! నీ తీయని కోర్కె చందనము పూయం జంద్రిక ల్వోయ నె మ్మన మెంతేఁ దనివోయె; నీ కరణిఁ బ్రేమల్ లోకసామాన్యముల్. | 14 |
| శా. | కానీ, యొక్క కొఱంత నా మనసునం గారించు; నీ వింత య న్యూనప్రీతి వెలార్చు ముచ్చటకు నేదో యడ్డముం జెప్పుచు న్నానా? యం చనిపించు; నైన నొక ప్రాణప్రాణమిత్త్రమ్ము నా కీ నేలం గరణీయ మొం డునిచి పోయెన్ సత్య నిత్యాత్ముఁడై. | 15 |
| మ. | తొలినాఁట న్విలసిల్లు తెల్గునెఱజోదుల్ మెచ్చ బాలెంత బె బ్బులినోటం జెయివెట్టి కూల్చిన బలమ్మున్ బీరముం గూరు ను జ్జ్వలవీరుల్ గల పద్మనాయకుల వంశంబందు మందారమై యొలసెన్ వేంకటరాయఁ డీ వెఱుఁగ వొక్కొ! వాని సౌహార్దమున్. | 16 |
| మ. | అది యీ నాఁటిది కాదు మైత్రి; గత జన్మాధార సంస్కార సం పదుపానీతము; ముప్పదేఁడులకుఁ బైపై సాగి యా పొల్పు ప చ్చఁదనం బేదెఁ; దదీయ మిత్రతకు లక్ష్యం బింతయున్ లేమి నా బ్రదుకేదో యొకరీతిగాఁ గుతుక దూరస్థంబుగాఁ గన్పడున్. | 17 |
| సీ. | తన తనూకాంతిఁ బోలిన పండుతల పైఁడి । గిరజాల మేలి సుందరతతోడఁ దన యశః పరిణాహమును బోలె నింపూర్చి । యెసలారు వెడఁద నెన్నొసలితోడఁ దనయెదవోలెఁ దెల్లనగు వల్వలు దాల్చి । నడయాడు వెలియేన్గు నడకతోడఁ దన వర్తనముఁ బోలి, వెనువంపు గొనని జ । గా వెల్మవంశంబు ఠీవితోడ | |
| గీ. | స్నేహ మోహనభాషణ శ్రీలతోడ । ‘రేమెల’ మహాన్వయమ్ముపేరిమికి నెలవు నా యనుంగైన వేంకటరాయఁ డిపుడు । జీవచిత్రముగా సుధాస్మృతికి వచ్చు. | 18 |
| గీ. | మనసులో మాటలోఁ దియ్యఁదనము మెఱయఁ బలుకరించెను; మన కుటుంబమున కెట్టి, వెలితి రాకుండఁ దిలకించె; విలువ నెంచి పంచె వార్షిక ధాన్య సువర్ణరాశి. | 19 |
| శా. | ఆయుర్వేద చికిత్స హేతువుగ స్నేహాంకూర మారంభమై చేయిం జేతికి నిచ్చెఁ; జెల్మి బలమై చేదోయిఁ జేదోయికిం దీయం బెంచుచుఁ దెచ్చె; నేండ్లు గడవన్ డెందంబు డెందంబుతో రాయంజేయుచు వచ్చె నయ్యమృత పూర్ణస్వాంతుఁ డీ నాయెడన్. | 20 |
| చ. | ‘మన యుభయాన్వయమ్ములు క్రమంబుగఁ బెంపు వహించి, తీపులా ఱని యనుబంధముల్ తరతరంబులవెంట నిటుల్ రహించుఁగా’ కనియుఁ దలంచినట్టి మహితాశయుఁ; డాయన లోనలోనఁ గో రినయది పండినప్పు డలరించుఁగదే! ననుఁ దత్కుటుంబమున్. | 21 |
| చ. | అతితరమైన మా చెలిమి కాదరువై తనరారఁ దండ్రికిం బ్రతినిధియై గుణజ్ఞతకుఁ బట్టగు నాదొరపట్టికిన్ భవత్ కృతి నెఱకాన్క యి; మ్మదికదే! విధిగా నుభయైకతారక స్థితి; యిఁక నేమి చెప్పుదును దెల్పితి నా హృదయాభిలాషమున్. | 22 |
| వ. | అని వచించిన పితృబ్రహ్మ యుపదేశం బాదేశంబుగా నౌదలంగొని పద్మనాయకవంశ రత్నదీపమ్ము శ్రీ రేమెళ్ల వేంకట రాయిణింగారి ప్రథమ సంతానమైన శ్రీ వేంకటరావుగారి చెలిమి గుర్తించి హంసశ్రోతయైన మజ్జనకునకు సన్నిధానవర్తినై శ్రీమదాంధ్రపురాణము వినిపించుచుఁ గబ్బంపుదొర నభినందించువాఁడ. | 23 |
| గీ. | ఆంధ్ర ధారుణి భీమఖండాంతరమునఁ బాఱు ‘నాత్రేయి’ వాహిని పజ్జ వెలయు దుగ్గుదురు గ్రామ; మందు నిస్తులనికామ భాగ్యరంగము ‘రేమెళ్ల’ వంగడంబు. | 24 |
| చ. | గురుతరమైన భాగ్యమునకున్ దొరయైన వితీర్ణి - దానికిన్ సరిపడు సద్రసగ్రహణశక్తియు రక్తియుఁ గల్గి ‘యుత్తరా పరిణయ’ కావ్యకర్తయయి పండితులం దనియించి కీర్తి భా స్వరత నెనంగె నవ్వెలమవంశపు వేంకటరాయఁ డెన్నఁడో. | 25 |
| గీ. | అట్టి కవిధీరులను సువిఖ్యాతులైన వీరులను జిత్రకారులఁ బెంచినట్టి రేమెలాన్వయమున మత్పితృప్రియుండు తాతతండ్రుల మించి పెత్తనము నెఱపె. | 26 |
| ఆ.వె. | అతని మొదటి పంట యైన వేంకటరావు భావ మెన్నఁ గపిలగోవు వెన్న మలి తనూజుఁడైన లలితుండు వేణుగో పాలరావు మల్లెపూల ప్రోవు. | 27 |
| మ. | ఇటు లీకబ్బము గారవించిన ఘనుం డేపారు రేమెళ్ల వేం కటరా; వాయన చూపువెంట సకల గ్రామంబు పాఱాడుఁ; బి న్నటి నవ్వుల్ రమణించునప్పెదవివెంటన్ విచ్చు దోసిళ్లు; బా సటయై యాతని మాటపోఁడిమి సమస్యల్ తీర్చుఁ బ్రాంతీయులన్. | 28 |
| మ. | పొలముల్ సేద్యముగట్టి బంగరువు కూర్పు ల్వెట్టు భూస్వామి; పె ద్దలలోఁ బిన్నలలోనఁ దా నొకఁడుగాఁ దారాడు మేధావి; పే దల యిబ్బందులు చూచి జాలిగొను చింతారత్న; మాతండు పు త్రులతో మన్మలతో నితోధిక సుఖస్తోమంబుఁ జూఱాడుతన్! | 29 |
| మ. | నవనీతార్ద్రము చిత్తమున్, సుకవితాంతఃప్రీతి, సాహిత్య బాం ధవమున్ ధీర గభీర నిర్మలిన మౌనవ్యాఖ్యతో విప్పి మ త్కవితాచంద్రిక సోఁకి పొంగిన యుదాత్తస్వాంతు నౌదార్య సిం ధువునన్ బిందు వొకండు నా పయిని జిందుల్వెట్టె నీ తీరునన్. | 30 |
| మ. | కపురంపుం బెడఁగారు హారతులతోఁ - గల్యాణ వాద్యంపుఁ దీ రుపుతో - సత్కవిసాధువాదముల కూర్పుంబొల్పుతో వచ్చి, యాం ధ్రపురాణమ్మును మెచ్చి కైకొను మహోదారుండు పెంపొంద వే లుపు లాశీరమృతప్రసూనములఁ జిల్కుం డుల్లసత్ప్రీతిమై. | 31 |
| గీ. | ఇంతకును - నెల్లకృతులకు నెవఁడు కర్త? యెవఁడు భర్త? అతండు కర్తృత్వ భోక్తృ తాద్యతీతుండు సర్వ కావ్య ప్రపంచ భద్రతకు మూలహేతువు పయిని గలఁడు. | 32 |
| ఉ. | సన్నుతకీర్తి భారత రసాస్థలి కెల్లను మేలిమచ్చులై యెన్నిక నంది తెన్గుజనయిత్రి ఋణమ్మును వడ్డితోడఁ దీ ర్పన్నెఱినెంచి, ధర్మపరిపాలనముం బొనరించి యెన్నఁడో చన్న మహానుభావుల ప్రశంసల సేఁతలు జాతి కొప్పదే? | 33 |
| చ. | తెలుఁగున వేలయేండ్లుగ గతించిన గాథలపెంపు కొండ గు ర్తుల పెనుగుంపు గాని “యిది రూఢిగ నిట్టిది” నాఁగఁ దేల్ప నె వ్వలన నసాధ్య, మైన నొకపాటి చరిత్రము నేఁడు నేర్పుఁ దీ ర్పులఁ బరిశీలకుల్ తడవి ప్రోవులు వెట్టిరి పుణ్యబుద్ధులై. | 34 |
| చ. | పొలపముఁ దప్పి పుర్వులకు భుక్తులు వెట్టెడి తాటియాకుఁ గ ట్టలు - నెపు డెప్పుడో పుడమి డాఁగిన శాసనరాజి - వగ్గువా రలబడి నివ్వటిల్లిన పురాణకథల్ - ససిమాయు శిల్పముల్ తెలుఁగుచరిత్ర తొల్లిటిగతిన్ వచియించును గొంచియమ్ముగన్. | 35 |
| గీ. | అఱమఱుఁగు మేలిముసుఁగులో నందగించు నాంధ్ర చారిత్ర సుమనోహరాంగి భంగి మనసుపండువుగా నెంచుకొనెడి సిరికి నోఁచువాఁడు, రసజ్ఞత మోచువాఁడు. | 36 |
| క. | అభిజాతులు బుధపరిష న్నిభృత వచోనిధులు కీర్తనీయాభ్యుదయుల్ శుభవర్తనులు పురాంధ్ర ప్రభువులు; తచ్చరిత మిఁకఁ బురాణింపఁబడున్. | 37 |