| ఉదయ పర్వము |
| గీ. | శ్రీమదాంధ్ర వసుంధరాసీమ నొలసి దక్షవాటీ మహాస్థాన దైవతమ్ము- కాళనాథేశ్వరుండు - శ్రీశైలవిభుఁడు- తెలుఁగువారల నాశీర్వదింతు రెపుడు. | 1 |
| మ. | ప్రణిధానంబునఁ జూడ నాంధ్రుల చరిత్రన్ వేనవేలేండ్ల క ప్పునఁ బెంపారిన యాదిగాథ యొకఁ డింపుల్వుట్టఁజేయున్ సదా తనమై యార్షపురాణబద్ధమయి; యేతద్గాథకున్ మూలకా రణమౌ బ్రాహ్మణ మైతరేయము సమారాధ్యమ్ము మున్ముందుగన్. | 2 |
| ఆ.వె. | ఆంధ్రుఁ డనఁగ నెవ్వఁ! డాంధ్రదేశాభిఖ్య యేల వెలసె! ననెడి యిట్టి ప్రశ్న ములకు బదులుగాఁగఁ బలికెడి తొలినాఁటి గాథ లొండు రెండు కలవు పుడమి. | 3 |
| సీ. | వింధ్యకానన మహావీథి కుత్తరమున । వరలెఁ గొండొక రాచవంగడంబు; తద్వంశమందు మందార సాలమువోలె । సంభవించెను హరిశ్చంద్ర నృపతి; యతఁడు వేధసునకు ననుఁగు సంతానమై । పేరుపెంపున ధరాభార మూనె; మదికి నభ్యుదయమ్ము నొదవించు మగమొల్కఁ । గన నోఁచుకొనని వెక్కసము మోసి | |
| గీ. | ఱేఁడు పెన్నిధిఁ దొఱఁగినవాఁడు, నెడఁద । విధికి వెఱచిన వాఁడునై విహ్వలించెఁ; దలఁపుఁదీవలఁ బ్రసవబాంధవము నతుకు । కడుపు లేకున్నఁ దండ్రి కెక్కడిది బ్రతుకు! | 4 |
| మ. | అనపత్యుండయి కుంది వందురు రసాధ్యక్షున్ హరిశ్చంద్రునిం గని పెద్ద ల్వచియించి రిట్టులు ‘తలంకంగాదు భూపాల! వి చ్చిన భక్తిన్ మనసిచ్చుచున్ వరుణు నర్చింపం దనూజన్మ ధ న్యునిగా ని న్నొనరించు దైవమతఁ; డన్యుల్ కారునిర్వాహకుల్. | 5 |
| క. | అని వినిచిన యుపదేశపుఁ దనుపున కభిధాంతరముగ ధరణీపతి య ర్చనసేయఁ జేయ జలదే వునియెద తనివోయి పొంగి పొరలం బడియెన్. | 6 |
| మ. | తలవంపుల్వడి సన్నవాఱిన నిజోత్సాహంబులో, నిండుఁగౌఁ గిలికిన్ లోఁగిన ముద్దుచూలి యనురక్తిన్ భావనావీథి జు ఱ్ఱలు వేసెన్ నృపమౌళి; దైవకరుణారంభంబు చేసేఁతఁ బు వ్వులు పూసెన్; గరుణించె నవ్వరుణదేవుం డా హరిశ్చంద్రునిన్. | 7 |
| వరుణదర్శనము; వరప్రదానము |
| వ. | సాక్షాత్కరించిన యప్పరమ దయామయు నడుగుఁ దామరలతావు లంటి మిన్నంటినటులై హరిశ్చంద్రభూనేత యన్నీటిఱేనికిఁ దనకోరికి నెఱింగించుటయు నవ్వేలుపు కొఱనవ్వు నవ్వి - | 8 |
| మ. | అకటా! మా కొక చిక్కు తెచ్చితి వసాధ్యంబైన నీలోని కో రికఁ బండించుట యెట్టులో తెలియ; దార్తింగుంద; కీ నీదు పు ట్టుకకుం బుత్రకృత ప్రమోదమున నిండు న్మెండు చేకూరు భా గ్యకళాయోగము లేదు; దానికి నుపాయం బొండె కన్పట్టెడిన్. | 9 |
| ఆ.వె. | నీకుఁ బుట్టినట్టి నిసువును బశువుగాఁ జేయఁగలవె రాజసూయమందుఁ? గానియెడల - నీకుఁ గలుగఁడు బిడ్డండు లేని బెడఁద కేల పూనుకొనెదు? | 10 |
| గీ. | అనుడు, బడబాగ్ని తోడుగా నవఘళించు వరుణు నమృతాక్షరానిలభరము సోఁకి సొగపుగొని తేఱుకొని వెల్గుఁ జూచి యిటులు పలికె నా భూమిపతి పేదయెలుఁగు తొలఁక. | 11 |
| గీ. | లోకమున వంశవృక్ష మైక్ష్వాక మిటులు మ్రోడువడక చిగుర్చుటే ముక్తి నాకు; నా చివురు పూవు కాయగా నేచి, పండ నరయవలె ననికూడఁ బేరాసవడను. | 12 |
| ఉ. | కన్నుల వెఱ్ఱివేడ్క తొలఁగం దలఁపారఁగ నొక్కతూరి నా యన్నువ నెత్రుచూలుఁ బసుపాడిన తత్ప్రసవిత్రి పొత్తిటన్ గన్నది చాలు నింతకు వినా వరుణా! నినుఁ గోర; నాపయిం గన్ననిసుంగు నధ్వరపుఁగాన్కగ నిల్పెద; నిన్నుఁ దన్పెదన్. | 13 |
| వ. | హరిశ్చంద్రుం డసంతానుం డను తక్కువపేరు తొలంగి పుత్రజాతుం డనిపించుకొనుటయ పదివేలని నివేదించు నా ఱేని పరిదీనప్రార్థనంబునకుఁ గరఁగి వరుణదేవుండు వాని నిబంధనంబున కొడంబడి యంతర్హితుం డయ్యె. | 14 |
| మ. | ఇటు జాల్వాఱిననీటిఱేనిదయ దోయిళ్లన్ హరిశ్చంద్రుఁ డా దటఁ జూఱాడియు రాణివాసమున కంతన్ గర్భ మింపారె న న్నటు లాలించియు దందడించిన మహానందంబునందోఁగె; నూ ఱటమై వేడుక లూఁగెఁ దత్ ప్రకృతివర్గంబందు సంస్థానిలోన్. | 15 |
| గీ. | మీఁదఁ గసివోవ విసరెడి చేఁదుగాలి జాడ లెఱుఁగని దా హరిశ్చంద్రురాణి; యామె యప్పటి సంతస మంతులేని హలహలము దాఁచుకొన్న మహాబ్ధిపురుడు. | 16 |
| ఉ. | ప్రామిన చీకటుల్ పలుకఁబాఱి క్రమంబుగ విచ్చిపోవఁ బ్రా చీముఖమందుఁ బ్రొద్దువొడిచెన్ హిత ‘రోహిత’ రోచిరంకుర స్తోమమునన్; నృపాలకవధూమణి పొత్తిట జొత్తుపాప కెం దామర ముద్దులూర్చెను; మనంబు లెలర్చెను రాచజంటకున్. | 17 |
| గీ. | ఎట్టయెదురుగఁ జిందాడు నెడరు వైపు తొనకుఁ జూపులఁ బఱపి యజ్జనవిభుండు కన్నబిడ్డను గని నవ్వుఁ గానినవ్వు; రాణిఁ గననీఁడు తనయెదలోనినొవ్వు. | 18 |
| చ. | ‘జరిగినమాట దాఁటి యెటసాగెద వీచిటిపాపఁ జంపి య ధ్వర మొనరింపఁగాఁ బ్రతినవట్టితి వో కపటీ! స్మరింపవో యెరవుధనంబుపై మమత యేటికి మాటికిఁ బెంచుకొందు’ వం చుఱిమిన యట్టులైన జడియున్ మదిలో నొడయండు మెండుగన్. | 19 |
| గీ. | ఆరఁబండిన తములపుటాకుఁ బోని లేఁబురుటియాలి పసిపొత్తిలికి బెడంగు రోహితుని ముద్దు-ఱేఁడు దారుణతరాసి ధార మెఱుఁగారు తేనెపూఁతగఁ దలంచు. | 20 |
| గీ. | జేవుఱించిన కనుఁగోపు - లావులించి మ్రింగ నుంకించు నోరునై మీఁది కుఱుకు వరుణదేవుని నిలువు భావమున వెలయ వెఱచుఁ; గంపించుఁ; జేష్టలు మఱచు ఱేఁడు. | 21 |
| గీ. | పృథులతరమైన బాధలో మధురిమముగ మధురిమములోన బాధగా మాఱి నృపతి కొక్కకంట ముదశ్రువు లోడిగిల్ల నోడిగిల్లె శుగశ్రువు లొక్కకంట. | 22 |
| చ. | తరఁగలుగట్టిపాఱు వసుధావరు వెచ్చని యశ్రుధారలం దెరలిన నీటిఱేఁ డలుకదేరిన కన్నులువిచ్చి పల్కె ని క్కరణి - ‘నృపాల! యేల తమకంబు వహించెదు, నీ కుమారు నె వ్వరిదరి నుంచె దీ వరుణుపాశముఁ గాదని మోసగించుచున్. | 23 |
| గీ. | బాసఁ దలపోసి నీబిడ్డఁ బశువుఁ జేసి జన్నమున వేల్చి ననుఁ దన్పఁ జనుట మఱతొ కడుపుతమకముతో-’ నని పిడుగు లుమియఁ జెదరుగుండియ ఱేఁడు పాశి నిటువేఁడు. | 24 |
| మ. | ఇలువేల్పట్టులు పుట్టి మాబ్రదుకులం దింపూర్చుచున్ బాలవ త్తులకేనిన్ ససినోరురాని పసికందుం బట్టి పాలాడు నీ కొలకుం జేతులురావు; లేఁజివురుటాకుం దున్మితూఁటాడి మ్రో డులుగాఁ బాడఱు పాపజాతి తలిదండ్రుల్ నీకు క్షంతవ్యులే! | 25 |
| గీ. | ఎఱుకకును మాఱుపేరైన వరుణ! నీకుఁ గఱప మే మెంతవారము! పురుటి యంటు తొలఁగినం గాక యధ్వరబలికిఁ దగునె మూఁతవిడువని కనుల లేలేఁత పశువు! | 26 |
| మ. | అని యాభూపతి పల్కినన్ మనసు నీరై మాఱుమాటాడ నే రనివాఁడై వరుణుండు పోవుడుఁ, గుమారప్రేమపాశైక బ ద్ధునకున్ ఱేని కగాధమౌ జలధియందుం గొంతచేయూఁత యం దినయట్లాయెను; బూరిపోఁచ యొకఁడూఁదెన్ స్వావలంబమ్ముగన్. | 27 |
| చ. | దొరకిన పోఁచ యూఁతముగఁ దోఁచక పట్టిన వెఱ్ఱిఱేని సం బరమది విశ్లథంబుగఁ గృపం బెడఁబాసిన పాశి వెండియున్ నరవరుఁ జూడఁగాఁ బురుటినాళులు దాఁటినవెంట వచ్చి తొం దరపఱిచెన్ మఖంబునకుఁ దత్సుతుపైగల కూర్మిపెంపునన్. | 28 |
| వ. | హరిశ్చంద్రభూజాని వరుణదేవున కేమి చెప్పుటకుం దోఁచనివాఁ డొక వెరవు దొరకి మెఱపుతోడి నీలనీరదమూర్తియై- | 29 |
| గీ. | నీ యెదుట ధర్మసరణి వర్ణించి నొడువ నెంతవారము దేవ! క్షమింపఁగాదె! దంతములు రాని పశువు మేధ్యమ్ముగాదు; నీవు గాదన బిడ్డఁ గొంపోవు మిపుడ. | 30 |
| చ. | అనుడు, దయార్ద్రమైన దరహాసము మోమున మోసుదేఱ న జ్జనవిభుమోసముం దెలిసి సంతతిపైగల మోహ మిట్టిదం చును నొక వ్యాఖ్యచేసికొనుచున్ సయిచెన్ మది రోసమేది పో యెను వరుణుండు; ఱేని కొకయింత సుధాకణభుక్తి చేకుఱెన్. | 31 |
| చ. | తొలిజనులందు నాటుకొని దోసపుఁ జల్లులు నేఁటి కీగతిన్ మొలచె ననంగ దంపతుల ముద్దులమూటల కింక రద్దులై పొలుపులఁదేలు పాలపసిబుగ్గలకుం జిఱునవ్వు వెల్గు వం పులిడెడి మొగ్గలై రదనముల్ తుదలెత్తెను రాచకూనకున్. | 32 |
| ఆ.వె. | శిశువు బోసినోరు చివురించెఁ; దోడనె జేవుఱించె వరుణదేవు కన్ను; లరుగుదెంచె నరయ నాహరిశ్చంద్ర భూ పాలు నాడినట్టి బాసతీరు. | 33 |
| ఉ. | వచ్చినవానిఁ గాంచి తలవంచి పటుక్కునఁ బ్రేమపాశమున్ వ్రచ్చిన పాశికిన్ బదులు వల్కఁగ నేరక దేవ! దంతముల్ వచ్చినవెంట నీ చిఱుతవానిని నధ్వరవీథిఁ గాన్కగా నిచ్చెదనంటి లెస్స చనవిచ్చుట నొక్కటి విన్నవించెదన్. | 34 |
| ఉ. | ఆడినమాట కాదని భయప్రదమౌ భవదీయ పాశపుం బోఁడిమి వాఁడిమిం గడచిపోఁ దరమా! పరమాదరంబు ముం దాడఁగ నన్ను నీ యభయహస్తపు నీడకుఁ జేరఁదీసి యీ వేడుక చెల్లఁగా నమృతభిక్ష యొసంగుమయా దయాశ్రయా! | 35 |
| గీ. | బాలునకు నేఁడు మొలచిన పాలపండ్లు తిరముగా నుండఁజాల; వీ తెఱఁగు పశువుఁ గ్రతుసమర్థముగా సమర్థనముసేఁత యెన్నఁగా ధర్మదేవత కన్నుమూఁత. | 36 |
| వ. | అనినంత నమృతమూర్తియగు ప్రచేతసుండు పుత్రప్రణయ పురస్సరం బగు హరిశ్చంద్రు వేఁడికోలునకు మాఱాడక యూరీకరించి యప్పటికిం దిరోహితుండై మఱికొంతకాలము గడచిన పదంపడి విచ్చేసి తొల్లిటియటులు జన్నంబొనర్పు మని నిర్బంధించుటయు న య్యేలిక దోయిలించి వరుణున కిట్లనియె; దేవా! నీయెఱుంగని ధర్మముండునే! క్షత్రియుండు కవచియు ధానుష్కుండునుంగాక సవనపశువుగా విశసింపఁబడుట ధర్మవ్యత్యయంబుగదా యనుటయు నీటిఱేఁడు బాడబంబు బోని క్రోధంబు మ్రింగికొని కానీ చూత మని యొడంబడి పోయి కొంత కాలమ్ము వదలిన- | 37 |
| చ. | పొదలిన జవ్వనంపుఁదలఁపుల్ తొలకాడఁగఁ జేతికందఁగా నెదిగిన రాచబిడ్డ బలియిమ్మని వచ్చెఁ బ్రచేతసుండు సౌ హృదమును ద్రోసిపుచ్చి; ధరణీశుఁడు శోకమహాహలాహలో న్మదశిఖ లేచి రేఁగ గళనాళమునం దిగనాఁగి యిట్లనెన్. | 38 |
| గీ. | అమృతసఖమగు నీ యంతరంగమునకు నప్పువడినాఁడఁ; బలుసార్లు త్రిప్పినాఁడ; నిదియు నాలోని తీపిగా నెంచి సైఁచి యందుకొమ్ము మదన్వవాయాంకురమ్ము. | 39 |
| మ. | అని డగ్గుత్తిక జీరువాఱి వెతవోయన్ ‘నాయనా, రోహితా!' యనుచున్ భూపతి నెవ్వగం దనయు నొయ్యంబిల్చె; నాతండు చ య్యన నేతెంచి యుదంచిత ప్రణయ ధన్వంబైన యాతండ్రి చాఁ చిన పొందారెడి సందిటన్ మధురుచిశ్రీబిందువై జాఱఁగన్. | 40 |
| గీ. | మాయ మర్మము నెట్టికర్మము నెఱుఁగని బిడ్డలో నెల్ల యుసుఱుల నొడ్డి ఱేఁడు తనయు లేలేఁతవ్రేళ్లమెత్తనఁ దడవుచుఁ దడిపె నాతని నులివేఁడి జడులతోడ. | 41 |
| గీ. | ఆజడులఁ ద్రెంచుకొని పడె నార్ద్రమైన పిడుగు లీరీతి రోహితు నెడఁద కదలి యదరువేటుగ నదవదయై భ్రమింప నఖల సామ్రాజ్యరమ హృదయము ద్రవింప. | 42 |
| శా. | ఒడ్డారించిన పాశపాణి భవదాయుర్వల్లిఁ దున్మాడఁ గే లొడ్డెన్ నేఁ డిదె; వెఱ్ఱివేడుకలతో నుఱ్ఱూఁత లూఁగించి తో బిడ్డా! నిన్నొక యాటబొమ్మవలెఁ జూపెన్ బాపపుంగర్మ; మీ వెడ్డున్ దాఁటగ దిక్కుమాలితి మహోర్వీ సార్వభౌముండనై. | 43 |
| మ. | కని - సర్వస్వము నీవుగా మని, కడంకన్ గండముల్ త్రెంచి పెం చినవాఁడన్; మఱి యీ వసంతమున నీచేఁ జిచ్చు వెట్టించు కొం దును దండ్రీ! నినుఁబట్టి యధ్వరమునందుం బాలగుంజం గృతాం తుని చందంబున గుంజికట్టి విశసింతున్; బెంతు నైర్ఘృణ్యమున్. | 44 |
| మ. | దయకున్ దవ్యుల నున్న తండ్రియెడ నీదండంబు మున్ముందు ని ర్ణయముం జేసి వచింపు; మావలఁ గుమారా! బాసకున్ లోఁగి య ప్రియముం జేసెదఁ జేతులార వరుణప్రీతిన్ ఘటింపన్; దుర త్యయనిత్యస్థితి నంది చూఱకొను మన్నా! బంధురానందమున్. | 45 |
| గీ. | అని హరిశ్చంద్రుఁ డలమటంగొనఁ, గుమారు మనసులో దాఁగియున్న యమాయికతకు నొక నవీన ధోరణిని లౌకికపుటెఱుకఁ గఱపినటులయ్యెఁ దండ్రి దుఃఖమ్ముచుఱుకు. | 46 |
| రోహితుని పలాయనము |
| వ. | అగుటయు మృత్యు భయభర భ్రాంతుండు రోహితుం డప్పటి కేమి యనక నాఁటి నడురేయిఁ బడుకకేని తెలియరాక ధనురేకసహాయుండు రాజసౌధంబు విడిచి చని చని యొక గహనంబునం జొచ్చి యటఁ బొంచి నడయాడుచుండె. | 47 |
| ఆ.వె. | పశువు రోహితుండు వడిఁ దిరోహితుఁడౌట సర్వసిద్ధమైన జన్న మాఁగె; నన్నమాటఁ దప్పెనని హరిశ్చంద్రుపై వరుణుకన్ను లెఱ్ఱవడుచు రేఁగె. | 48 |
| ఉ. | రేఁగిన నీటిఱేని కనురేకలతో నలఱేని పొట్టపైఁ దీఁగలవోలెఁ జాఱ లగుదెంచి కలంచి - జలోదరోపతా పాగతిఁ దెల్పె; భూమిపతి యన్నముముట్టఁడు; డప్పి కోర్వఁ; డా రోగము గడ్డుదేర బెదరున్; జెదరుం దనగుండె నీరు గన్. | 49 |
| మ. | అటు లారాజు జలోదర వ్యథకు లోనైయున్న దుర్వార్త - య క్కటికం బారఁగ నొక్కఁడున్ వెఱపుమైఁ గారూళ్ల వెన్వెంటఁ బా పటవోవం దిరుగాడు రోహితునకుం బాపంబు పండన్ శ్రవః పుటముల్ వ్రచ్చెను; విచ్చె వాని కనుఁదమ్ముల్ బాష్పరేణూద్గతిన్. | 50 |
| గీ. | పొడమె వెనువెంట రోహితు నెడఁదలోన దాఁగి యూఁగాడు నొక్క నెత్తావి యిటులు; ‘కొమరుఁడనె నేను! జనకుఁ బ్రాణములఁ బాపి ముదము గుడుతునె యీ పాడు బ్రదుకుఁ దీపి! | 51 |
| గీ. | ప్రియముఁ దండ్రికిఁ దెలిపి, క్షత్త్రియత నిలిపి యాగ పశువుగ నాహుతి యగుదు నోపి; వ్యాధిఁ దొనఁకిన జనకు జీవనము పొంటె నీబ్రతుకు నిత్తుఁ గలదె నా కింతకంటె’ | 52 |
| చ. | అని తలపోసి, యాత్మ పిత నట్టులు మోసము చేసిరాక నె మ్మనమున రోసి, రోహితుఁడు మల్లడిగొన్న త్రపాభరంబు ముం దు నడవ యజ్ఞవాటిఁ దమితో నెఱవిందయి తండ్రిఁ గావఁ బ త్తనమున కేఁగ నెంచె; విధి తప్పునె! యెప్పటి కేది కప్పునో!! | 53 |
| గీ. | జబ్బుపడియున్న తండ్రి రక్షణము సేఁత యాత్మజుని చేత నైన భాగ్యమ్ముకాదె! యీ యదృష్టము రాదు రోహితున; కెంత మనసు కలిగిననేమి కర్మమ్ము లేమి. | 54 |
| మ. | తన ప్రాణమ్ములు కుప్పవోసి పితృసంతాపోపశాంత్యర్థ మ ప్పనసేయం దలపోయుచుం బురముత్రోవం బోవు నారాజపు త్రుని మోసంబున వేల్పుఱేఁడు పలుసారుల్ మాఱువేసంబులం గని సాకుల్ వచియించి యాఁగె మఖదీక్షాపాలనేర్ష్యాళువై; | 55 |
| ఆ.వె. | మనసు తండ్రిమీఁదఁ దొనఁకియాడ నతండు తనకు మా ఱొకండు మనుజపశువు వెదకనెంచి యడవివెంటఁ బల్లెలవెంట నొదిఁగి తిరుగులాడు చుండునంత. | 56 |
| మ. | నిలువం బోవఁగ వెన్కముందులగు ప్రాణి న్నిల్పి కాపాడఁగాఁ దొలిపున్నెంబుల పంట ‘సూయవసు’ పుత్రుండౌ నజీగర్తుఁ డు జ్జ్వల భవ్యాకృతి బ్రహ్మవర్చసపుఁజెల్వం బూఁతగా నిల్చు నె మ్ముల గూఁడై కనుపట్టె రోహితునిచూపుల్ తీపులై దీపిలన్. | 57 |
| చ. | పొగిలి దిగుల్గొనం జివికిపోయిన పేదఱికమ్ము గుండియం బగిలిన ముక్కలట్లు నలువంకల న ‘య్యజిగర్తు’ బత్నియున్ ముగురు కుమారులుం గదిసి మూఁగుటకుం దలయూఁచి వేడ్క పెం పుగ నవనీసురున్ దరియఁబోయెఁ బితృప్రియకాంక్ష త్రోయఁగన్. | 58 |
| క. | డగ్గరి - యడఁకువఁ గేల్గవ యొగ్గి యజీగర్తు భూసురోత్తముఁ గని యీ యెగ్గతపుఁ జోట నేలా మ్రగ్గెదు వీరలు కుటుంబమా! యని యడుగన్. | 59 |
| వ. | ఆ క్షత్త్రియకిశోరుం గనుంగొని యజీగర్తుం డుపవాసకృశం బగు పేద యెలుంగున నోయీ! యే నొక యభాగ్యుండగు బాఁపనయ్య; నీమె నాయిల్లాలు; వీరలు శునఃపుచ్ఛుఁడు శునశ్శేపుఁడు శునోలాంగూలుఁడు నను నామధేయంబులు గల నా కన్నకడుపులు. నే నియ్యడవి పల్లియలం దారాడి తిరిపంబెత్తుకొని యుత్తలంపడుచు నీ బిడ్డలం బోషించుకొనుచున్నాఁడను. ముదుసలినై యీ నిరుపేద బ్రదిమి నిఁకమీఁద నెటు లీఁదుటయో తోఁచకున్న యది యనుటయు- | 60 |
| గీ. | వనట యొదవించు పేదబాఁపని చరిత్ర వినుట రోహితు నెడకంటఁ దొనఁకె నశ్రు; వతని కుడికంట వెనువెంట నంకురించె సుందరానంద మధులవ స్పందనంబు. | 61 |
| చ. | పితృహిత మెంచి భూసురుని పేదతనమ్ముఁ దలంచి, యెన్నఁడో చితికిన కట్టెలో మరల జీవము పూవులు పూచినట్లు రో హితుఁ డెద సంతసించి తన యీప్సిత మ య్యజిగర్తు సన్నిధిం గొతుకుచుఁ గొందలించుచు దిగుల్గొనుచున్ వచియించె నీగతిన్. | 62 |
| శా. | స్వామీ! యేనొక రాచమొల్కను; హరిశ్చంద్రుండు నాతండ్రి గా రామారం గని నేను బుట్టుటకుఁ బూర్యం బేదొ బాసాడి న న్నామంత్రించి మఖంబునందు బలివేయం బోవ - జీవాత్మ కే దో మాధుర్యము పుట్టి నెట్టె నిటు లాయుర్గర్భ దుర్భాగ్యతన్. | 63 |
| మ. | బ్రతుకుందీపులు త్రోపులాడ నిటు సర్వవ్యాపిఁ గన్గప్పి వ చ్చితిఁ; దండ్రిం గికురించితిన్; దుదకు నాచేతాఁకునన్ ధారుణీ పతికిన్ దారుణమౌ జలోదరము దైవక్రోధ దుష్పాక ధూ పితమై చేపడెనంట; యేకరణి నర్పింతుం బితౄణం బిఁకన్. | 64 |
| మ. | ఒఱగొడ్డంబు సమస్య వచ్చినది; నాదో, తండ్రిదో జీవితం బెరయై పోవలె నింక; నా బ్రతుకుపై నీ నాఁటికే నాస యో సరలే దక్కట! దిక్కుమాలినది మత్ స్వార్థంబు; నా మాఱుగా నరుఁ డొక్కం డెవఁడేని యాగబలిదానం బైన మేలౌఁగదే! | 65 |
| మ. | అవురా! నాతలఁ పింతచెడ్డది; పరార్థైక వ్రతఖ్యాతుఁ డే ద్రవిణంబో రవణంబొ యీఁగలఁడు; స్వప్రాణంబులే నాకుఁగా నెవఁ డిచ్చున్! మఱి యిచ్చినం గలదె యానృణ్యంబు తత్త్యాగగౌ రవ భావంబునకుం గృతజ్ఞతగ సర్వస్వంబు నర్పించినన్. | 66 |
| క. | ఏనొక్కఁడ మావారికిఁ గానుపనై యుంటి; జాలి కలిగిన దేనిన్ బోనీ, యీ మూవురు సం తానములో నొకనిబదులు నను మనుపఁగదే! | 67 |
| మ. | అని మండాడెడి రాచబిడ్డయెడఁ ద్రోయన్రాని నేయంబు ము న్కొనియావెన్క నమాయికత్వమున సూనున్ జన్నపుంగాన్కగాఁ దన కర్పింపఁగ వేఁడుకోలునకుఁ జింతాక్రోధ దుస్సంధి దా కొని యా పేదకుటుంబి యీ కరణి వాకోఁ జాగె నుద్వేగియై. | 68 |
| ఉ. | ‘ఏ నొకరాచమొల్క’ ననియేకద, నీకథ నెత్తికొంటి వో కూన! కులంబు గౌరవము కూడ దిసంతులవంతు చేసి నీ ప్రాణపుఁ జిందు నాకడుపుపై నిడ ధర్మువె? క్షత్త్రబంధుతా ధీనము నీతలంపు తెగుదెంపున కేమని మాఱు సెప్పుటల్! | 69 |
| మ. | ఎకసక్కెంబున కాడితో యిటులు మే మేపూఁట కాపూఁటఁ గూ టికిఁ గొట్టాడుచు నుండవచ్చు; నది యట్టే యుంచు; మేతండ్రి తిం డికినై బిడ్డను బిండివంటకము వండింపంగ నుంకించుఁ; గొం కక యీ సేగి వెలార్పఁ బుట్టవలె నింకన్ దందశూకంబుగన్. | 70 |
| మ. | పరమశ్రద్ధ వహించి శాస్త్రవిధులం బాటించి కర్మైక త త్పరతం బైతృక మాచరించు నిజసంతానంబుతోఁ దండ్రి పు న్నిరయాపాయముఁ బాయఁ ద్రోసికొనుఁగానీ, పుత్త్రతంజెండి నె త్తురులం బిండి యెవండు వైతరణి నీఁదుల్వోవఁ గేల్సాఁచెడిన్. | 71 |
| క. | కానీ, నీ యాంతర్యము నే నర్థము చేసికొంటి; నిప్పటి యీ నా లో నిలువున నీ తండ్రియ కానంబడునేమొ చూడఁగదె నీ వన్నా! | 72 |
| చ. | అనుటయు సిగ్గునం జిదికి యారటమంది వడంకు దోయిటం దొనఁకెడి బాష్పబిందువులతో నటు నిల్చిన రోహితుం గనుం గొని యజిగర్తు పత్ని వలుకున్ దనభర్త యెలుంగునం బ్రతి స్వన మన - రాచపుండుపయిపై మిరెపుంబొడి రాచినట్లుగన్. | 73 |
| శా. | ‘వత్సా! నీ వొక తల్లిబిడ్డఁడవు గావా! ముద్దుముచ్చట్లు సం పత్సర్వస్వము నిండ బుజ్జవము నింపం బెంచి పోషించు న వ్యాత్సల్యంబును నుజ్జగించి వెలమోవం గాన్పుఁ బోకార్చు నా పత్సంకల్పము మాతృమానసపుఁ ద్రోవం జూపు సారించునే?’ | 74 |
| చ. | కుడి యెడ చెంపపెట్టులుగఁ గొట్టఁగ దంపతు లాడినట్టి యీ నుడులకు రాచపుట్టువు కనుల్ కొనలెత్తిన నీలిమబ్బులై జడిగురిసెన్; జగా మెఱపుచాయ హోరంగులు వోసె; జాలి వెం బడి నిముసమ్ములోఁ బదనువాఱవె పాఱుల నిండుడెందముల్. | 75 |
| గీ. | అసువు లఱచేతఁ బట్టి-రాజసము నెట్టి తండ్రి జీవితరక్షఁ జిత్తమునఁ బెట్టి- కుతిలపడుచున్న వాని రోహితుని నరసి కరఁగె నజిగర్తు రెండవకాన్పు మనసు. | 76 |
| ఉ. | ‘పాపము! వీని కెట్టి దురవస్థ తటస్థపడెం; బితృవ్యథా వ్యాపనముం దొలంపఁ దనప్రాణము లొడ్డుటొ, వంగడంబులో దీపము తా నడంగినఁ బితృప్రతిరక్తకణమ్ము మాఱి నీ రై పొరివోవుటో, కటకటా! యిటు రావల దెవ్విరోధికిన్. | 77 |
| ఉ. | రాణకు రాని నా యలఁతి ప్రాణము లేల! పరోపకార పా రీణత మించుగాఁ దొలకరించిన యప్పుడె జీవనంబు వి న్నాణము పుల్కరించు; మరణ ప్రకృతిన్ గుఱుతించి సజ్జన ప్రీణన ధోరణిన్ సవదరించి తరించెదఁ గాక యిత్తఱిన్. | 78 |
| మ. | అని లోలోఁ దలపోసి జాలిగొని, దేహత్యాగరాగంబు హె చ్చిన డెందంబున రోహితుంగని శునశ్శేపుండు తీపారు తీ రున నీరీతి వచింపసాగెఁ దలిదండ్రుల్ సంభ్రమాశ్చర్య శో కనికారైక నికృత్త చిత్తులు విసంగన్, సిగ్గునం గ్రుంగఁగన్. | 79 |
| చ. | సుడిఁ బడియున్న నీదు మనసున్ గుఱుతించితి నన్న! తండ్రి కొ క్కఁడవయియున్న హేతువునఁగాదొకొ, యీయురియాటయెల్ల; నే ల్బడిగొని జాతిధర్మ మతవల్లికిఁ బ్రాఁకగునట్టి ఱేఁడు దో రెడునెడఁ గేరడంబు పచరించుట తత్ప్రజ కెట్టి ధర్మువో! | 80 |
| ఉ. | కానక కన్నకానుపు సుకానకు నోఁచక సూను జన్నపుం గానుక వెట్టుకోవలయు కర్మము తండ్రికిఁ బట్టరాదు; భూ జానిపరార్ధ్యుఁ డొక్కఁడు ప్రజాకృతమౌ నికృతిన్ గతాసువౌ దానికి నోర్చు కాలగతి తట్టఁగ రా; దది చెట్ట నేలకున్. | 81 |
| చ. | ఇది యిటులుండ, బోనమున కేఁకరి యాఁకట నెత్తువోవుచుం బొదిగొనియున్న మూఁడుకడుపుల్ తడుపం దిరిపెమ్ము నెత్తియే లిదమున జీవయాత్రఁ గదలించెడి తల్లికిఁ దండ్రికిన్ సుఖా భ్యుదయము నీని నా బ్రతుకు పోకడ వాకొన నౌనొ నీకడన్! | 82 |
| శా. | నేను న్నీవలె నిష్ప్రయోజనత నుంటిన్; మంటి నిన్నాళ్లు; నా యీనిర్భాగ్యతఁ గన్నవారి మదు లి ట్లేడాట లాడించితిన్ గానీ, నీదయకల్మి నిర్మలిన సంకల్పంబుతో స్వార్థసం ధానోత్సర్గము వెల్లడించు తఱిగాదా! నాకు నీ నాఁటికిన్. | 83 |
| మ. | జనకుం డాడిన పల్కులో నొక రహస్యం బేను గుర్తించినాఁ డను ‘జ్యేష్ఠాత్మజు జాతమాత్రుఁగనువెంటం బుత్త్రియౌ మానవుం’ డని కాదా విబుధోక్తి! తండ్రి నిరయాపాయంబుఁ బోఁద్రోయు పె త్తనముం బూనిన యన్నవెంట నొకసోదర్యుండ నే నియ్యెడన్. | 84 |
| గీ. | ముద్దు ముచ్చట నిండు ప్రేముడియు మోసి తల్లి యెడ వెన్నెల ల్వోసి - తనియఁ జేసి యొనరు నొక తమ్ముఁగుఱ్ఱకు వెనుకఁబడిన వాఁడ; మా యమ్మ కే నెడవడ్డవాడ. | 85 |
| మ. | అగుటన్ నాకుఁ బరోపకార కృతి భూయస్స్వాపతేయంబు రా శిగఁ జేఁజిక్కు మహావకాశ మిటుతోఁచెన్; దేశరక్షా కళా నుగతిం బేర్వడు సార్వభౌము బ్రతికింతుంగాక! నీ డెందపున్ నొగులున్ డింతునుగాక! పేదతలిదండ్రుల్ నన్ను దీవింపఁగన్. | 86 |
| చ. | అని యిటు విప్రసూతి హృదయంబు నిరంబుదమైన వానముం పును వెలయింపఁ, జాతకపుఁబుల్గుగ రోహితుఁ డట్టెచూచి తి య్యని తనివందె; సుప్రణయహంసలు భూసురవంశ దంపతుల్ తనయుని పల్కు వానజడి దందడికిం బుయిలోట నందరే? | 87 |
| గీ. | ఉఱుము లురవడిసేయు పేదఱిమి నేదొ మెఱపుఁ గన్గొనిరో, కాక - కరఁగియున్న కడుపువెన్న మునింగిరో, కాక - విధికి లొంగిరో యేమొ యప్పు డాలును మగండు. | 88 |
| క. | తనయు శునశ్శేపునిఁ దీ పును దిగమ్రింగికొని రాజపుత్రున కమ్మం గొనె నతఁడు ధేనుశతకము ధనమిడి; యది యింధనముగదా దుఃఖశిఖిన్! | 89 |
| శా. | ఆజీగర్తినిఁ జక్రవర్తి తనయుండౌ రోహితుం డప్పు డ య్యోజన్ విల్చినవెంటఁ బిల్చి సకలాయుఃపాశముం బట్టి, ని ర్వ్యాజోదార దయాసుధాలయ తదీయాంతర్యముం గట్టి, భూ మీజానిం దనతండ్రి మృత్యుముఖగామిం గావఁ గొంపోవఁగన్. | 90 |
| హరిశ్చంద్రునియాగమున దేవరాతుఁడు సంరక్షితుఁడగుట |
| వ. | హరిశ్చంద్రుండు పెద్దకాలమ్మునకు బ్రతికివచ్చిన తనూజు నాలింగనము చేసికొనె; రోహితుండును సవనపశు ప్రతినిధిగాఁ దాను గొనివచ్చిన శునశ్శేపునిగూర్చి వచించె; నంత నాఱేఁడు సంతోషబంధురుండు వరుణు నావాహనం బొనరించి శునశ్శేపుండు పశువుగా జన్నంబుసేఁత కంగీకరింపుమని బహుధా వేఁడుకొనుటయు నాప్రచేతసుండు కరఁగి చిఱునవ్వునవ్వి ‘రాచవానికంటె భూసురుండు మేలుకదా సరి కాని’ మ్మనె; నంత మహనీయుండగు విశ్వామిత్రుండు హోతగా, జమదగ్ని యధ్వర్యుఁడుగా, వసిష్ఠుండు బ్రహ్మగా, నాయాస్యుం డుద్గాతగా హరిశ్చంద్రుని రాజసూయం బుపక్రాంతంబగుటకు నిశ్చయింపఁబడియె. | 91 |
| మ. | అతిభక్తిప్రతిపత్తి నానృపతి శ్రేయమ్మెంచి వర్ణాశ్రమ శ్రుతిధర్మంబుల కాఁపుసేఁతయెడ నేర్పున్, గూప వాపీ ప్రపా యత దేవాయతనాది రూపకృతి భూయస్సంస్థలం దీర్పు, నా ఢ్యతఁ బాటించుచుఁ జేసె ముమ్మొదట నిష్టాపూర్తహోమక్రియన్. | 92 |
| గీ. | క్షత్త్రియుండగు నా హరిశ్చంద్ర నృపతి “దీక్షణీయేష్టి” బ్రాహ్మ్యముం దెచ్చుకొనియు- “నుదవసానీయము”న క్షాత్త్రపదవి నెనసి పశువుఁజేసె శునశ్శేపుఁ బట్టి నొంప. | 93 |
| వ. | ఉపాకృత సంస్కరణమ్ము వెనుకఁ గుశపాశమ్ములఁ బాలగుంజకు బంధితుండై యున్న శునశ్శేపుఁడు పర్యగ్నికరణానంతరము తన విశసనమ్ము భావించి యంతలోఁ దొల్లింటి ధైర్యౌదార్యంబులెల్ల సడలి యాజానజంబైన ప్రాణంపుఁదీపి ముంచుకొన- | 94 |
| గీ. | ‘తల్లిదండ్రుల ముద్దుఁ గౌఁగిళ్లు గడచి కలసియాడిన యన్నదమ్ములను విడిచి వాఁడిగల మిత్తికోఱలఁ బడితి నేఁడు మొఱ్ఱవిని ముక్తినిడు కృపామూర్తి వీవ. | 95 |
| ఆ.వె. | ఆయురమృత భిక్ష నాసించి శ్రుతిమంత్ర యుక్తి నిన్ను వేఁడుచుంటి దేవ! యాయురాశతోడ యజమానుఁడును వేఁడు రెండు కోర్కె లవధరింపఁ గదవె!’ | 96 |
| ఆ.వె. | అనుచు వరుణు వేఁడె; నగ్నిదేవుని వేఁడె; నింద్రు వేఁడె; వేల్పు లెల్లవారి వేఁడెఁ; గట్టకడకు వెక్కి యుషస్స్తుతి సేయువెంట సుకృత సీమ పండి. | 97 |
| మ. | తన బంధమ్ములు దేవతాదయ లవిత్రం బౌచుఁ ద్రుంచన్ జిగి ర్చిన ప్రాణమ్మున నొక్కగంతునిడి యాజీగర్తి గాధేయు పొ త్తున మోక్షార్థియుఁబోలె నత్తుకొనెఁ; దోడ్తో నాఋషిబ్రహ్మ మా తని నాత్మోద్భవు నట్టు లొత్తుకొనెఁ జేతస్సంభృ తానందుఁడై. | 98 |
| గీ. | అల శునశ్శేపు పరిదేవనారభటికిఁ గరఁగి కరడెత్తి వరుణుండు కానిపించె; సవన పరిపూర్ణ ఫలదాన సంప్రయుక్తి నా హరిశ్చంద్రు నుపతాప మపనయించె. | 99 |
| గీ. | ఇత్తెఱంగున వేల్పుల యెదలఁ దొనఁకు నమృతకణికలు కరఁగించి యదితిసుతుల చెలిమి రాపాడు నా శునశ్శేపునకును బుడమిఁ బెంపారె ‘దేవరాతుఁ’ డనుపేరు. | 100 |
| ఉ. | ఆయువు వోసి, పుత్ర శతకాధికమౌ నొక కూర్మి మోసి, గా ధేయుఁడు దేవరాతు మదిఁ దీర్చి తనర్చి - సరస్వతీ సరి త్తోయ కణోల్బణార్ద్రమగు దోయిలి నెత్తి తొనంకు తాపస శ్రీయుతమైన స్వాశ్రమముఁ జేర్చెఁ దనూజులు తూఁగి మూఁగఁగన్. | 101 |
| ఉ. | అంతలు నింతలై పితృపదాబ్జమురేకులు సోఁకనంటి కే రింతలు వోవుచుం బరిచరించెడి బిడ్డల నూర్వరన్ దయా వంతుఁడు బుజ్జగించి తనపజ్జ నెలర్చిన దేవరాతులో వంతులు సూచి కౌశికుఁడు వల్కెఁ దనూభవు లుల్కి నిల్వఁగన్. | 102 |
| ఉ. | “తీపుల నించి, వేల్పుల మదిం గరఁగించి మహాధ్వరంబునన్ యూపము కట్టుఁ బాసి పునరుద్గతి నాయొడిఁ బడ్డ యీ శున శ్శేపుఁడు- దేవరాతుఁడు- ప్రసిద్ధుఁడు- వీనిని గన్న కాన్పుగా నే, పరికించుచుం బరిచయించితి సంచిత బంధవాసనన్. | 103 |
| మ. | అగుటన్ - మీ కితఁ డన్న; మీ రితని నెయ్యంబెంచి సౌభ్రాత్ర మే పుగ వర్తింపుఁడు నేఁటినుండి; తలవంపుల్ రాని, సంసారపున్ నొగులున్ సోఁకని యైకమత్యపుఁబసందుల్ మీయెడన్ దిద్దు పె ద్దగఁ బూజింపుఁడు వీని స్వీయ సకలార్థత్యాగ దీక్షాఖనిన్.” | 104 |
| గీ. | అని వచించుచు దేవరాతుని చరిత్ర సాంతముగ విన్చి కడుఁ బ్రశంసలను గురిసెఁ గౌశికుఁడు; తండ్రి యిడిన యాదేశమునకు వార లెల్లరు నివ్వెఱపాటు గొనిరి. | 105 |
| మ. | కొమరుల్ నూర్వురు వెంటవెంట నిరువాఁగుల్వోయి; రుద్భ్రాంత చి త్తములం గొందఱు ‘దేవరాతునెడ సౌదర్యమ్ము సౌహార్ద ముం తు’ మటం చాడిరి తండ్రి యానతికిఁ జేతుల్మోడ్చి; యామాట కాం ధ్ర మధుచ్ఛందులు మున్నుగాఁగలకుమారశ్రేణి వెన్కాడఁగన్. | 106 |
| ఉ. | బన్నము లెన్ని పైఁబడుచు వచ్చిన నొచ్చిన నాత్మగౌరవ స్కన్నత సైఁపలేని గుణశాలి- యుదాత్తము క్షత్త్రధర్మ మా పన్నత నొంద నోరువని పౌరుషవంతుఁడు శాంతుఁ ‘డాంధ్రుఁ’ డం త న్నెఱవాదియై పలికెఁ దండ్రికనుంగవ జేవుఱింపగన్. | 107 |
| మ. | శరణీయుండవు తండ్రి! విప్రుని మనశ్శల్యంబుఁ ద్రోపాడ నె వ్వరు కాదందురు! కాని యౌరసతఁ జూపన్ క్షాత్త్రసంపన్నతా గురుతల్ నిల్చునె! పూవుఁబానుపుపయిం గూర్చుండఁగాఁజేసి యె ల్లర మర్చింతుముగాక! లోనితలఁ పేలాదాఁచి మాటాడుటల్! | 108 |
| మ. | తన యౌదార్యము పొంగులై చవులుచిందన్ స్వార్థమున్వీడి జీ వనదానంబున సార్వభౌము బ్రతికింపన్ మున్ను బాసాడి, యా డిన మాటన్ దిగనాడి- కట్టకడ నోడెం బ్రాణపుందీపి ము న్కొనఁగా; నట్టి భయస్థు పెత్తనము నాంధ్రుం డెట్టు లగ్గించెడిన్. | 109 |
| ఆ.వె. | క్షత్త్రజాతి ధర్మ సంత్రాణమునుగోరి యగ్గి నుఱుకుమన్న నళుకుసెందఁ; బరమ తపముఁ గొన్న బ్రహ్మర్షులుగ మిమ్ముఁ గొలుచుకొందు- నెడఁద నిలుపుకొందు. | 110 |
| గీ. | జనకు నాదేశమునకుఁ గా దనెడునంత గుండె గలవాఁడఁగాను; లోఁకువ నడంగి క్షత్త్రధర్మమ్మునకు విషక్షతులు తెచ్చి యుండఁగలవాఁడఁ గాను; బోనుంటి నిపుడ. | 111 |
| మ. | అని మాఱాడి, స్వతంత్రతారతి స్వధర్మాపేత దాస్యమ్ము పా ల్గొనఁ గాలాడక తండ్రివీడి యనురక్తుల్ సోదరుల్ కొంద ఱ ల్లన వెన్నాడఁగ “నాంధ్ర” నేత యిటునేలన్ ముట్టి తొల్లింటఁ బా లనముం జేయుట నాంధ్రదేశ మని పిల్వంజెల్లె నీతీరునన్. | 112 |
| ఆంధ్రోదయము; భాగవతకథనము |
| ఉ. | ఆయతమై యనాదియు ననంతమునై తగు కాలగర్భమం దేయెడ నెప్పు డేది యుదయించెనొ తేల్చుటకాదు; నిత్యతా శ్రీయుత మాంధ్రజాతి తొలిరేకలు వెన్కకుఁ బోయిచూడఁ ద్రే తాయుగవీథిఁ దోఁచును గృతస్థితి విశ్వమనోహరాకృతిన్. | 113 |
| గీ. | కవితనూజాత లావణ్యఖనియు నైన దేవయాని, పాతివ్రత్యదీప్ర నిష్ఠ నెలవు శర్మిష్ఠ- తనకు భార్యలుగ వెలయ నఖిలధారుణి నేలె యయాతి నృపతి. | 114 |
| గీ. | అల యయాతివంశీయుఁడౌ బలికిఁ బొడమి రంగ వంగ కళింగ పుండ్రాంధ్ర సింహు లనెడి పుత్రులు; వారి పాలనము నెనసి స్వర్ణములుపండెఁ బ్రాచ్యదేశమ్ము లాఱు. | 115 |
| గీ. | బలిసుతుం డాంధ్రుఁ డేలుటవలన దీని కాంధ్రరాష్ట్ర మనంగ విఖ్యాతి వెలసె నని వచించెను భాగవతాది సుకృతు; లేదియెటులున్న నిది యనాదీయజాతి. | 116 |
| చ. | పృథుతర వీరభోగము, నభిన్న మహోదయ భావబంధ, ము న్మథిత విరోధి యూధము, సనాతనకీర్తి రథమ్ము ‘దక్షిణా పథము’న నున్న రాష్ట్రముల వాసి గడించిన యాంధ్రరాజ్వపుం బ్రథ యొకనాఁటిదే? కవుల వర్ణన ధోరణి కందుపాటిదే! | 117 |
| గీ. | కాలుబలఁగము లక్షయు- గజబలమ్ము వేయి- గుఱ్ఱపుదడములు వేలురెండు- దుర్గములు ముప్పదియు నొప్ప దొడ్డరాచ దనము నడపించెఁ దొల్లింటి తెనుఁగునేల. | 118 |
| పర్వాంతము |
| మ. | అపరోక్షంబగు దైవ మీ వగచు నాయం దింద్రియాతీత సౌ ఖ్యపదార్థన్ఫురణంబు మేలుకొలుపంగా నెంచి యీతెల్గుఁగూ రుపుగుట్టుల్ వెదవెట్టినాఁడవఁటె! నేర్తున్ నేర్వఁగాకేమి! యాం ధ్రపురాణోదయపర్వముం గనవె! తాతా! గర్భరూపంబుగన్. | |
| మ. | రఘువంశమ్మును సన్నిధిం జదువఁగా రమ్మన్న లేఁబ్రాయమం దఘదూరమ్ము పురాంధ్రవీరుల చరిత్రాధ్యాయముల్ సంభృతో దఘనోద్బృంహిత చంచలారుచుల చందంబై హృదాకాశమం దు ఘటించెన్ స్పృహణీయదీప్తి; వినిపింతున్ నేఁడు తద్గాథలన్. | |