| కావ్యములు | మను చరిత్రము | ప్రథమాశ్వాసము |
| ప్రవరుని సౌశీల్యాది ప్రశంస | ||
| ఉ. |
ఆ పురిఁ బాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి, భా షాపరశేషభోగి, వివిధాధ్వర నిర్మల ధర్మకర్మ దీ క్షాపరతంత్రుఁ, డంబురుహగర్భ కులాభరణం, బనారతా ధ్యాపన తత్పరుండు, ప్రవరాఖ్యుఁ డలేఖ్య తనూవిలాసుఁడై. |
51 |
| ఆ. |
వానిచక్కఁదనము వైరాగ్యమునఁజేసి కాంక్షసేయు జార కామినులకు భోగబాహ్య మయ్యెఁ, బూచిన సంపెంగ పొలుపు మధుకరాంగనలకుఁ బోలె. |
52 |
| ఉ. |
యౌవనమందు యజ్వయు ధనాఢ్యుఁడునై కమనీయకౌతుక శ్రీవిధిఁ గూఁకటుల్ గొలిచి చేసిన కూరిమి సోమిదమ్మ సౌ ఖ్యావహయై భజింప, సుఖులై తలిదండ్రులు గూడి దేవియు\న్ దేవరవోలె నుండి యిలుదీర్పఁగఁ, గాపుర మొప్పు వానికి\న్. |
53 |
| సీ. |
వరణాతరంగిణీ దరవికస్వర నూత్న, కమల కషాయగంధము వహించి, ప్రత్యూషపవనాంకురములు పైకొనువేళ, వామనస్తుతి పరత్వమున లేచి, సచ్ఛాత్త్రుఁ డగుచు నిచ్చలు నేఁగి యయ్యేట, నఘమర్షణస్నాన మాచరించి, సాంధ్యకృత్యము దీర్చి సావిత్రి జపియించి, సైకతస్థలిఁ గర్మసాక్షి కెఱఁగి, |
|
| తే. |
ఫల సమిత్కుశ కుసుమాది బహుపదార్థ తతియు, నుదికిన మడుఁగుదోవతులుఁ గొంచు బ్రహ్మచారులు వెంటరా, బ్రాహ్మణుండు వచ్చు నింటికిఁ బ్రజ తన్ను మెచ్చి చూడ. |
54 |
| శా. |
శీలంబున్, గులము\న్, శమంబు, దమముం, జెల్వంబు లేఁబ్రాయముం బోలం జూచి యితండె పాత్రుఁ డని యే భూపాలుఁ డీ వచ్చిన\న్ సాలగ్రామము మున్నుగాఁ గొనఁడు మాన్యక్షేత్రముల్ పెక్కు చం దాలన్ బండు నొకప్పుడుం దఱుఁగ దింటం బాఁడియు\న్ బంటయున్. |
55 |
| తే. |
వండ నలయదు వేవురు వచ్చిరేని నన్నపూర్ణకు నుద్దియౌ నతనిగృహిణి యతిథు లేతేర నడికిరేయైనఁ బెట్టు వలయు భోజ్యంబు లింట నవ్వారి గాఁగ. |
56 |
| సీ. |
తీర్థసంవాసు లేతెంచినారని విన్న, నెదురుగా నేఁగు దవ్వెంతయైన, నేఁగి తత్పదముల కెఱఁగి యింటికిఁ దెచ్చుఁ, దెచ్చి సద్భక్తి నాతిథ్యమిచ్చు, నిచ్చి యిష్టాన్న సంతృప్తులఁగాఁ జేయు, జేసి గూర్చున్నచోఁ జేరవచ్చు, వచ్చి యిద్ధరఁ గల్గు వనధి పర్వత సరి, త్తీర్థమాహాత్మ్యముల్ దెలియ నడుగు, |
|
| తే. |
నడిగి యోజన పరిమాణ మరయు నరసి పోవలయుఁ జూడ ననుచు నూర్పులు నిగుడ్చు ననుదినము తీర్థసందర్శనాభిలాష మాత్మ నుప్పొంగ నత్తరుణాగ్నిహోత్రి. |
57 |
| క. |
ఈ విధమున నభ్యాగత సేవాపరతంత్ర సకల జీవనుఁడై భూ దేవకుమారకుఁ డుండం గా విను మొక నాఁడు కుతప కాలమునందున్. |
58 |