| కావ్యములు | మను చరిత్రము | ప్రథమాశ్వాసము |
| సిద్ధాగమనము - అతిథి సత్కారము | ||
| సీ. |
ముడిచిన యొంటి కెంజడ మూయ మువ్వన్నె, మెగముతోలు కిరీటముగ ధరించి కకపాల కేదార కటక ముద్రిత పాణిఁ, గుఱుచ లాతాముతోఁ గూర్చిపట్టి యైణేయమైన యొడ్డాణంబు లవణిచే, నక్కళించిన పొట్ట మక్కళించి యారకూటచ్ఛాయ నవఘళింపఁగఁ జాలు, బడుగుదేహంబున భస్మ మలఁది |
|
| తే. |
మిట్టయురమున నిడుయోగ పట్టె మెఱయఁ జెవుల రుద్రాక్షపోఁగులు చవుకళింపఁ గావికుబుసంబు జలకుండికయును బూని చేరెఁ దద్గేహ మౌషధసిద్ధుఁడొకడు. |
59 |
| తే. |
ఇట్లు చనుదెంచు పరమయోగీంద్రుఁ గాంచి భక్తిసంయుక్తి నెదురేఁగి ప్రణతుఁ డగుచు నర్ఘ్యపాద్యాది పూజనం బాచరించి యిష్టమృష్టాన్నకలన సంతుష్టుఁ జేసి, |
60 |
| క. |
ఎందుండి యెందుఁ బోవుచు నిందుల కేతెంచినార లిప్పుడు? విద్వ ద్వందిత! నేఁడుగదా! మ న్మందిరము పవిత్రమయ్యె, మాన్యుఁడ నైతి\న్. |
61 |
| క. |
మీమాటలు మంత్రంబులు, మీమెట్టినయెడ ప్రయాగ, మీపాద పవి త్రామలతోయము లలఘు ద్యోమార్గఝరాంబు పౌనరుక్త్యము లుర్వి\న్. |
62 |
| ఉ. |
వానిది భాగ్యవైభవము వానిది పుణ్యవిశేష మెమ్మెయి\న్ వాని దవంధ్యజీవనము వానిది జన్మము వేఱు సేయ కె వ్వాని గృహాంతరంబున భవాదృశయోగిజనంబు పావన స్నానవిధాన్నపానముల సంతస మందుచుఁ బోవు నిచ్చలు\న్. |
63 |
| తే. |
మౌనినాథ! కుటుంబజంబాలపటల మగ్న మాదృశ గృహమేధి మండలంబు నుద్ధరింపంగ నౌషధ మొండు గలదె? యుష్మదంఘ్రిరజోలేశ మొకటి దక్క. |
64 |
| క. |
నా విని ముని యి ట్లను వ త్సా! విను మావంటి తైర్థికావళి కెల్ల\న్ మీవంటి గృహస్థుల సుఖ జీవనమునఁగాదె! తీర్థసేవయుఁ దలప\న్. |
65 |
| సీ. |
కెలఁకుల నున్న తంగెటిజున్ను గృహమేధి, యజమానుఁ దంకస్థితార్థపేటి పండిన పెరటి కల్పకము వాస్తవ్యుండు, దొడ్డిఁ బెట్టిన వేల్పుగిడ్డి కాఁపు కడలేని యమృతంపు నడబావి సంసారి, సవిధమేరునగంబు భవనభర్త మరుదేశపథ మధ్యమప్రప కులపతి, యాఁకటి కొదవు సస్యము కుటుంబి |
|
| తే. |
బధిర పంగ్వంధ బిక్షుక బ్రహ్మచారి జటి పరివ్రాజ కాతిథి క్షపణ కావ ధూత కాపాలికా ద్యనాథులకుఁ గాన భూసురోత్తమ! గార్హస్థ్యమునకు సరియె? |
66 |
| క. |
నావుఁడు బ్రవరుం డి ట్లను దేవా! దేవర సమస్త తీర్థాటనము\న్ గావింపుదు రిలపై నటు గావున విభజించి యడుగఁ గౌతుక మయ్యె\న్. |
67 |
| శా. |
ఏ యే దేశముల\న్ జరించితిరి, మీ రే యే గిరుల్ చూచినా, రే యే తీర్థములందుఁ గ్రుంకిడితి, రే యే ద్వీపముల్ మెట్టినా, రే యే పుణ్యవనాళిఁ ద్రిమ్మరితి, రే యే తోయధుల్ డాసినా రాయా చోటులఁ గల్గు వింతలు మహాత్మా! నా కెఱింగింపరే! |
68 |
| తే. |
పోయి సేవింపలేకున్నఁ బుణ్యతీర్థ మహిమ వినుటయు నఖిల కల్మష హరంబ కాన వేఁడెద ననిన న మ్మౌనివర్యుఁ డాదరాయత్తచిత్తుఁడై యతని కనియె. |
69 |