| కావ్యములు | మను చరిత్రము | ప్రథమాశ్వాసము |
| ప్రవరునికి సిద్ధుఁడు పాదలేప మొసంగుట | ||
| చ. |
వెఱవక మీ కొనర్తు నొక విన్నప మిట్టివి యెల్లఁ జూచిరా నెఱకలు గట్టుకొన్న మఱి యేండ్లును బూండ్లును బట్టుఁ బ్రాయపుం జిఱుత తనంబు మీ మొగము చెప్పక చెప్పెడు నద్దిరయ్య! మా కెఱుఁగఁ దరంబె! మీ మహిమ లీర యెఱుంగుదు రేమిచెప్పుదు\న్? |
73 |
| క. |
అనినఁ బరదేశి గృహపతి కనియెన్ సందియముఁ దెలియ నడుగుట తప్పా? వినవయ్య! జరయు రుజయును జెనకంగా వెఱచు మమ్ము సిద్ధుల మగుట\న్. |
74 |
| మ. |
పరమంబైన రహస్య మౌ నయిన డాఁప\న్, జెప్పెద\న్ భూమిని ర్జరవంశోత్తమ! పాదలేప మను పేరం గల్గు దివ్యౌషధం పు రసం బీశ్వరసత్కృపం గలిగెఁ దద్భూరి ప్రభావంబునం జరియింతున్ బవమాన మానస తిరస్కారిత్వరాహంకృతిన్. |
75 |
| క. |
దివి బిసరుహబాంధవ సైం ధవ సంఘం బెంత దవ్వు దగ లే కరుగు\న్ భువి నంత దవ్వు నేమును ఠవఠవ లే కరుగుదుము హుటాహుటి నడల\న్. |
76 |
| మ. |
అనినన్ విప్రవరుండు కౌతుకభర వ్యగ్రాంతరంగుండు భ క్తి నిబద్ధాంజలి బంధురుండు నయి మీ దివ్య ప్రభావం బెఱుం గని నా ప్రల్లదముల్ సహించి మునిలోకగ్రామణీ! సత్కృప\న్ నను మీ శిష్యుని దీర్థయాత్రవలనన్ ధన్యాత్ముఁగాఁ జేయరే! |
77 |
| క. |
అనుటయు రసలింగము నిడు తన వట్రువ ప్రేఁపసజ్జ దంతపుబరణి\న్ నినిచిన యొకపస రిది యది యని చెప్పక పూసెఁ దత్పదాంబుజ యుగళిన్. |
78 |