| కావ్యములు | మను చరిత్రము | తృతీయాశ్వాసము |
| చంద్రోపాలంభము | ||
| క. |
అని యొడఁబడఁ బల్కుచుఁ దో డ్కొని వచ్చినఁ బాన్పుఁ జేరి గురుకుచ, తనపైఁ గనకనఁ గనలెడు వెలుఁగులఁ గనికర మఱి మండు చంద్రుఁ గని కర మలుకన్. |
35 |
| క. |
ఓచెల్ల! విరహిణీవధ మే చతురత నీకు? దురితమే చేయు పనుల్ రాచఱికపు ఫలమే? య య్యో చంద్ర! వివేక మెఱుఁగవొకొ గురుసేవన్? |
36 |
| సీ. |
తొలుదొల్తఁ గమలమిత్రుని వంక రూపౌట, దక్షాధ్వరధ్వంసి తన్ను గనుటఁ బరివేషమిషమునఁ బాశంబు దాల్చుటఁ, గప్పు దేహమునందుఁ గానఁబడుటఁ, గాలవశంబునఁ గాని తోఁపక యుంట, సతతనిష్ఠురగదాన్వితతఁ గనుటఁ బూని పాండుక్షేత్రమునఁ బ్రవర్తించుటఁ, బ్రకటానురాగతారకుఁ డగుటను |
|
| తే. |
నంతరం బెద్ది యాత్మలో నరసి చూడ రాజ! నీకును నల ధర్మరాజునకును? బ్రాణిలోకంబు బాధలఁ బఱుచునపుడు ధర్మపద మొక్కఁ డెక్కు డా ధన్యునందు. |
37 |
| చ. |
ఒక పెనుబాఁపఱేడు చలమొప్ప రసాతలసీమకుం, జకో రకములు భూతధాత్రికి, సురల్ దివికిం బగదీఱునట్లుగా మెకమెకపాటుతోడ నిను మ్రింగక పో రెపుడుం, ద్రిలోకకం టకుఁడవు గాన, నీయొడలు నజ్జుగఁ జేసి కురంగలాంఛనా! |
38 |
| క. |
వాతాపివలన నెఱిఁగితొ శీతకిరణ! కడుపుఁ జొచ్చి జీర్ణింపని యీ రీతి? నినుఁ దినియు నాయువు చేత సురల్ చెడరుగాక, చెఱుపవె వారిన్? |
39 |
| తే. |
త్రిపురసంహార మొనరించునపుడు హరుఁడు బండికల్లుగ నీమేను గండి చేసె నదియు సెలవాఱి తెగటాఱవైతి చంద్ర! యకట! రోహిణియెడ నపథ్యమునఁ జేసి. |
40 |
| తే. |
పాలఁ బుట్టిన మాత్రాన మేలి గుణము నేఁడు నీకేల గల్గు నో నీరజారి! నీటఁ బుట్టిన వాఁడు గాఁడోటు వహ్ని? కాల్చుచున్నాఁడు జగమెల్లఁ గరుణలేక. |
41 |
| క. |
గోవధము సేయు తురకల దైవంబవు నీవు మొదలఁ, దక్కక పాంథ స్త్రీవధము సేయ రోయుదె? నీవర్తన మేమిచెప్పు? నీరజవైరీ! |
42 |
| క. |
విడువక తలపయిఁ గొన్నా ళ్ళిడి చూచి కళంకి వగుట యెఱిఁగి, మహేశుం డుడుకుచు దక్షాధ్వరమున నడుగునఁ బడవైచె దాన నడఁగవు చంద్రా! |
43 |
| క. |
గాండీవము నీ చేతిది పాండవునిం జేరఁబట్టి బ్రతికితి మా వి ల్లుండిన నేఁడు నిశాచర! చెండవె యల్లునికిఁ దోడు శిత భల్లములన్? |
44 |