కవితలు విష్ణుధనువు (శిష్‌ట్లా ఉమా) విజయ మహేశ్వరము
ప్రేయసీ నిన్జూచి నీవాలకపు పోలికల జూచి నాచిత్తప్రవృత్తులు
తిల్లాణ తాళయుత గీత సంగీతముల తేలుతూ తురీయావస్థతో
ప్రతిధ్వనులు జేయ, తురీయ జగదనుష్ఠాన గంధర్వదేవతలు
గుమిగూడి వచ్చి నృత్యాల ద్రొక్కినారే!
వెలలేని ముత్యాలహారాల వెదజల్లినారే!
ముత్యాలు ముగ్గులైనయ్యే!
నాచిత్తప్రవృత్తులు సిగ్గులైనయ్యే!

నునుసిగ్గుల
చిరునవ్వులు
    రాలగా,
చంద్రికల
జల్తారు వ
    ల్లెలతో,
చకోరాలు
ఆడుకున్నవి
    పాడుతూ!
పూపలవల
చిరు చలవలు
    వీవగా,
గంధర్వులు వెన్నెల్లో విభ్రమపడి నిమీలన నిమ్నులైరి!

ప్రేయసీ! ని న్దలచి, నీ వాల్గన్నుల బిలిచి, వలచి, వెన్నెలై నామనసు,
గంధర్వదేవతల జగతిలో, ముత్యాలముగ్గులగు చంద్రికల చేమంతి
వనములో వాలాడి, పల్లవీ వల్లవోల్లాసానుపల్లవీ రాగముల
తీయ, దేవతలు జాలితో వెల్లువలైనారే!

ఎడలేక నిన్బిలుచు వడగాడ్పు సడిగుండె
వలపులు, వడగండ్ల వలపులైనయ్యే!
వడగాడ్పు వడగండ్ల వెన్నెల విన్నావే?

వెన్నెల్లో
వడగండ్లు
    రాలినై!
వెన్నెల్లో
వడగాడ్పు
    వీచింది!
వెన్నెల్లో
నీకై నీ
    చూపుకై
నామనస్సు
వగలాడి
    వెలవెలా,
వెన్నెల్లో విడిపోయి విడి పోయిపోయి ఎగురుచూ వెలిసింది!

మంచు బిందువుల ముసుగులో మల్లెపూవులవలె;
చిరులేత దుకూలముల జలతారు విరులవలె;
జలజలారాలిన వేవేల చేమంతి రెబ్బలవలే;

రావేయని వాపోవు గజప్రాణోత్సాహియై వేగ,
శ్రీపరిచేలాంచలము విడక, పరుగెత్తు హరివెనుక
శంఖమూ, చక్రమూ పరివారమూ గలసి శ్రీహరుల
వెన్నాడివచ్చు ఆపాల్కడలి కెరటాల తరకలల్లే

పూర్ణిమాచంద్రికల తరంగాలుప్పొంగిపారగా,
రావేయని పిలువగనే పర్వెత్తివచ్చు నిన్జూచి ఉప్పొంగి
ఉయ్యాల వెన్నెల్లో నామనసు ఉబలాటలాడింది;

రావేయని పిలిచినది నేనేయని తెలుసుకొని, సిగ్గుతో,
పరివార సహితుడై పరిహాసాస్పదుడై పోవు శ్రీహరిని
నేజూచి నీకు చూపించి నవ్వించి నవ్వగా
ఉయ్యాల నామనసు ఉర్రూతలూగింది!

మదనపంచమి నవ్వుచినుకుల కోలవెన్నెల్లో
ఒప్పులకుప్పల నవ్వుమూటల నాగకన్యలు
పాడుతారోయి నవ్వుమూటల కీరవాణులు
ఆడుతారోయి కీల్జడల కొప్పుకోలాటం!

అడుగడుగు పడుగుపేకల అల్లిబిల్లిగ అల్లి
వేరుపోతే వడకపెండ్లిండ్లోయి! మెల్లగ
దగ్గిరిలితే పెండ్లిపెండ్లిండ్లోయి! చల్లని
మదనపంచమి నవ్వుచినుకుల కోలవెన్నెల్లో!

కోలవెన్నెల్లో పూలతావుల పిల్లవాయువు,
నాగకన్యల, కీరవాణుల, వాల్జడల
కీల్జడల నవ్వుమూటల పిల్లవాయువు,
వేళాకోలం మరదలల్లే చెవిలో కొక్కొరోకోయి మని
    పిలిచి పోయిందోయి!
AndhraBharati AMdhra bhArati - kavitalu - viShNudhanuvu - (SiSh.hTlA umA) vijaya mahESvaramu Shishtla Umamaheswara Rao - Sishtla Umamaheswara Rao - kavitalu kavitvaM geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - telugu kavita - tenugu andhra ( telugu andhra andhrabharati telugu literature )