కవితలు విష్ణుధనువు (శిష్‌ట్లా ఉమా) విజయ మహేశ్వరము
కోయిలల కూయిలై పోయినయ్యి!
వాలుకొమ్మల పైని కలలలో తిరుగుతూ
    ఏవాడ నీడనో
    ఏకాకి జీవులై'
        ఏడనో
    పున్నాగ గ్రీవులై
కష్టనిష్టూరాల ప్రాణులైనయ్యి!

"ఈ వెన్నెల రేయిలో" భావాలు పొంగుతూ
చంద్రికలతో కలిసి మబ్బులో పెరుగుతూ
ఈవెన్నెలలో నన్ను ఊపుతున్నయ్యి!

చంద్రుడా! నాశరీరమొకదానినే
"ఈవెన్నెలరేయిలో" నిశ్చేష్టిగా జేసి
    కలలోనాతలపు
    ఇంద్రధనస్సై
        నావలపు
    ప్రేయసిమనస్సై,
సప్తవర్ణాలై యామెనొకదానినే,
నా హృదయమందు చిత్రితము జేసి,
నా మనోరాగ మంజూషగా జేసి,
సర్వవిశ్వమున ఆమెనొకదానినే

నా సంగీత సర్వవిషయము జేసి,
సప్తస్వర నాగస్వర మెత్తితిని
"ఈ వెన్నెలరేయిలో" భావాలు
రాగాలాపనలు జేసినవి!

గలగలల వాలుకొమ్మల పైన మేలుకొను
కిలకిలల చిలకపలుకులు విని
మేల్కొను విలవిలల కోయిలకూయి
విని మేలుకొను నామనసు, వాసంత ఉదయ
సమయమునందు, వాలుకన్నులతో,
కోయిలగొంతుతో, చిలకపలుకులతో,
రాదారిపై బోవు రాచకన్నెను జూచి "వాదాడి
వస్తినే చెంచీతా!" అనుటకై ఆరాటపడుతుంది;
వెర్రితో నామనసు
గలగలల కిలకిలల
విలవిలల వన్నెలతో
వసంతాలాడ్తుంది.

ఇస్సూలసోలుతో సేదకైవాలు నాశరీరము
మధ్యాహ్నపు వేడినిట్టూర్పుతో
రాట్నమై ఊహాపోహలను వడుకుతుంది!

గలగలల వాలుకొమ్మలపైన చేరుకొను
కిలకిలల చిలకపలుకులు విని
చేర్కొను విలవిలల కోయిలకూయి
విని, చేరుకొను నామన్సు, వాసంత సంధ్య
సమయమునందు, సోలుకన్నులతో
కోయిలకంఠపు చిలకపలుకులతో
రాదారిపైబోవు రాచకన్నెను జూచి "ఏవూరి
కమ్మరీ చేసినాడేభామ నీచేతి యల్దులూ," అనబోయి
వెర్రితో నామనసు
వేయి ఊహలమనసు
వాలాడు వెన్నెల్లో
వెలవెలా పోతుంది!
AndhraBharati AMdhra bhArati - kavitalu - viShNudhanuvu - (SiSh.hTlA umA) vijaya mahESvaramu Shishtla Umamaheswara Rao - Sishtla Umamaheswara Rao - kavitalu kavitvaM geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - telugu kavita - tenugu andhra ( telugu andhra andhrabharati telugu literature )